1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. telangana cm revanth reddy strong warning to brs mla's

రేవంత్ ముందు మీ ఆటలు సాగవు... బీఆర్ఎస్ సభ్యులకు సీఎం వార్నింగ్ - సభ్యుల సస్పెన్షన్

Revanth Reddy
ఈ రేవంత్ ముందు మీ ఆటలు సాగవు అంటు భారత రాష్ట్ర సమితి సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరిక చేశారు. పైగా, బీఆర్ఎస్ సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. 
 
సీఎం రేవంత్ ఆదివారం శాసనసభలో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని కేసీఆర్‌ తుంగలో తొక్కి, తాను సీఎం కుర్చీకి అతుక్కుని పోయారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదన్నారు. అప్పట్లో సీనియర్లను కాదని.. దళిత నేత భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ నేతను చేసిందని గుర్తు చేశారు. అయితే, దళిత నేత ప్రతిపక్ష నేతగా ఉండకూడదని బీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని.. ఎమ్మెల్యేలను లాక్కుని ఆ హోదా రాకుండా చేశారని రేవంత్‌ ఆరోపించారు. 
 
'వ్యక్తిగతంగా భట్టి విక్రమార్కను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు టార్గెట్‌ చేసి అవమానిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంతోమంది దళితులకు అవకాశాలు ఇచ్చింది. దళితుడి ముందు కేసీఆర్‌ చేతులు కట్టుకుని నిలబడాలని గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు స్పీకర్‌గా అవకాశం కల్పించాం. దళితుడు స్పీకర్‌గా ఉన్నారని శాసనసభకు కేసీఆర్‌ రావడం లేదు. దళిత మంత్రిని అవమానించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నించారు. 
 
బంధువుల కంపెనీని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత 12 ఏళ్ల  మైనింగ్‌ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ చేపడుతుంది. అక్రమాలపై ఆధారాలు ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలు సీఐడీకి ఇవ్వాలి. మైనింగ్‌ శాఖలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం. హరీశ్‌రావు కారణంగా తాను ఇరుకున పడ్డానని కేటీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇక్కడ ఉన్నది రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క. రేవంత్‌ ముందు బీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులు నడవవు' అని రేవంత్‌ అన్నారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని.. వారిని సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో కేటీఆర్‌, హరీశ్‌రావు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. 
తర్వాతి కథనం
పల్నాడులో మూడేళ్ల కుమార్తెతో కలిసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్య