1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana eduction ministry key statement on 10th class exam fee payble

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

telangana state
విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పదో తరగతి, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబరు 13వ తేదీ వరకు ఎలాంటి అపరాధం లేకుండా ఫీజులు చెల్లించవచ్చని పేర్కొంది. ఈ ఫీజులను అక్టోబరు 30వ తేదీ నుంచి చెల్లించవచ్చని వెల్లడించింది. 
 
ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం నిర్దేశిత గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 20 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 11 వరకు చెల్లించవచ్చు. చివరిగా, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 29 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు.
 
ఫీజుల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలని సూచించారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.60గా నిర్ణయించారు.
 
అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజును అందజేయాలని ప్రకటనలో తెలిపారు.
 
మరోవైపు, ప్రతి యేటా మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలను ఈ విద్యా సంవత్సరం కాస్త ముందుగానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు, ముఖ్యంగా సెకండియర్ చదువుతున్న వారికి ఎంసెట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చే లక్ష్యంతో ఈ మార్పు చేశారు. ఇంటర్ బోర్డు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గురువారం ఆమోదముద్ర వేసింది.
 
సాధారణంగా ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే మొదలుకానున్నాయి. విడుదలైన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. గత విద్యా సంవత్సరంలో ఈ పరీక్షలు మార్చి 5న ప్రారంభమైన విషయం తెలిసిందే.
 
పరీక్షలను ముందుగా పూర్తి చేయడం వల్ల ఫలితాలు కూడా త్వరగా వెలువడతాయి. ఇది వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియపై దృష్టి సారించేందుకు అధ్యాపకులకు వెసులుబాటు కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ