గత పాలకులు చేసిన తప్పులు నిలదీస్తున్నందే ప్రశ్నల వర్షం : సీఎం రేవంత్
గత పాలకులు భారాస, బీజేపీ నేతలు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు వేరు కావొచ్చు.. కానీ, వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటేనన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై బీఎల్‌ఏలతో కొడంగల్‌లో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
'ప్రతి పేదవాడికి మంచి చేసేందకు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవట్లేదు. కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు వేసినవాళ్ల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొడంగల్‌లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90శాతం కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారు. వారి ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారు.
కొడంగల్‌లో 78శాతం ఓటర్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాలి. మిగిలిన ఓటర్లతో బీఎల్‌ఏలు ఎస్‌ఐఆర్ నమోదు చేయించాలి. బీఎల్‌వోలు ప్రభుత్వాధికారులు.. బీఎల్‌ఏలు పార్టీ కార్యకర్తలు. ఓటరు జాబితాలో లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావు. గతంతో పోలిస్తే సరైన వివరాలు లేకపోతే పక్కన పెడతారు. అనుమానాస్పదంగా ఉంటే సరైన ఆధారాలు చూపి ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే నిర్ణయం అవుతోంది. కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగించేందుకు వీల్లేదు. ఈనెలాఖరు నాటికి కొడంగల్‌లో 100శాతం ఎస్‌ఐఆర్ పూర్తి చేయాలి. నాపై కుట్రలు చేసేవాళ్లను మీరే దెబ్బకొట్టాలి' అని సీఎం అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నేతలు, బీఎల్‌ఏలూ సమావేశంలో పాల్గొన్నారు.
