అప్పట్లో రూ.15 కోట్లతో 'ఛత్రపతి' కానీ.. రాత్రికి రాత్రే సీన్ మారిపోవచ్చు!: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
ప్రభాస్ హీరోగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన 'ఛత్రపతి' రిలీజై 10 వసంతాలు పూర్తయింది. 30 సెప్టెంబర్ 2005లో రిలీజైన ఈ చిత్రంతో మాస్ యాక్షన్ హీరోగా ప్రభాస్‌కి, యాక్షన్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.రాజమౌళికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇదే సినిమాతో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ 'ఛత్రపతి' ప్రసాద్‌గా ఫేమస్ అయ్యారు. బ్లాక్‌బస్టర్ హిట్ 'ఛత్రపతి' రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ 'ఛత్రపతి ప్రసాద్'తో స్పెషల్ ఇంటర్వ్యూ..
ప్రశ్న: 'ఛత్రపతి' రిలీజై 10 వసంతాలు పూర్తయింది. ఛత్రపతి ప్రసాద్‌గా మీకు గుర్తింపునిచ్చిన ఈ సినిమా విశేషాలు?
జ : ఛత్రపతి సినిమా రిలీజై 10 సంవత్సరాలైంది. అంతకంటే ముందే 15 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నా. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినా, ఛత్రపతి సినిమాతో ప్రత్యేకించి గుర్తింపు దక్కింది. ఈ సినిమాతోనే ఛత్రపతి ప్రసాద్‌గా పరిశ్రమలో పాపులర్ అయ్యాను. నా జీవితంలో మర్చిపోలేని సినిమా.
ప్రశ్న: ప్రభాస్ -రాజమౌళి కలయికలో తొలి సినిమా... నాటి జ్ఞాపకాలు?
జ : ప్రభాస్ - రాజమౌళి కలయికలో సినిమా చేయాలనుకున్నప్పుడు .. ముందుగా ప్రభాస్ ఈ కథ విని, బావుంది చేద్దామని అన్నాడు. తను కథని నమ్మాడు. మీ వెంట నేను ఉన్నా అంటూ ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళితో కలిసి ముందుకు వెళ్లాం. ఎస్.ఎస్.రాజమౌళి అప్పటికే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. వరుసగా మూడు హిట్లున్నాయి. ఈరోజు నా దర్శకుడు, హీరో ఇంటర్నేషనల్ ఫేమస్. బాహుబలి వంటి గొప్ప సినిమాని తెలుగు సినీపరిశ్రమకి అందించినందుకు ఆనందంగా ఉంది.
ప్రశ్న: ప్రభాస్ మాస్ ఇమేజ్ గురించి మీ అభిప్రాయం?
జ : ఛత్రపతి సినిమాతో యాక్షన్ హీరోగా ప్రభాస్‌కి మాస్‌లో ఇమేజ్ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా రిలీజై 10 ఏళ్లు అయినా ఇంకా గుర్తుండిపోయింది అంటే ప్రభాస్ నటన వల్లే.
ప్రశ్న: తొలి సన్నివేశం చిత్రీకరించినప్పుడు అనుభూతి?
జ : ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరిగింది. అది ఎప్పటికీ మర్చిపోలేనిది. సముద్రంలోకి భారీ క్రేన్‌తో షూటింగ్... సముద్రం మధ్యలో షార్క్‌తో సన్నివేశం.. పైగా కథానాయిక అక్కడికి వెళ్లడంతో రిస్క్ అవుతుందేమోనని భయపడ్డాను.
ప్రశ్న: మరోసారి ప్రభాస్ - రాజమౌళి కలయికలో సినిమా ఎప్పుడు?
జ : ఆ అవకాశం కోసం ఎంతో వేచి చూస్తున్నా. ప్రస్తుతం బాహుబలి 2 బిజీలో ఉన్నారు. రాజమౌళితో షూటింగ్ అంటే అది మెమరబుల్‌గా ఉంటుంది. మరి మా కలయిక ఎప్పటికి కుదురుతుందో?
ప్రశ్న: తుది వాక్యం?
జ : ఛత్రపతి సినిమాతో ఎంతో పేరొచ్చింది. బుల్లితెరపై ఎప్పుడు ఈ సినిమా వేసినా వెంటనే ఫోన్లు వస్తుంటాయి. అలా ఫోన్‌లు చేసి అడగడం మరపురాని అనుభూతినిస్తుంది.
ప్రశ్న: కెరీర్ తొలినాళ్ల గురించి?
జ : 1984లో పరిశ్రమకి వచ్చాను. 1985లో శోభన్‌బాబు హీరోగా 'డ్రైవర్ బాబు' సినిమా తీశాను. జనవరి 1986లో సినిమా రిలీజైంది. మొదట ఈ సినిమాని సూపర్‌స్టార్ కృష్ణగారితో తీయాలనుకున్నా, కాల్షీట్ల సమస్య వల్ల తర్వాత శోభన్‌బాబుతో తెరకెక్కించాం. కెరీర్ తొలి సినిమానే చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేశాం ఆరోజుల్లో. అది మరువలేని అనుభూతినిచ్చింది.
ప్రశ్న: అప్పటికి ఇప్పటికి బడ్జెట్ విషయంలో కంట్రోల్ మారింది కదా!
జ : 1984 నుంచి 2005 వరకూ 15 సంవత్సరాల కాలంలో ఎన్నో సినిమాలు చేశాం. నేను పరిశ్రమలోకి వస్తూనే పెద్ద సినిమాలు చేశాను. శోభన్‌బాబుతో ఆరోజుల్లోనే 40లక్షల్లో సినిమా అనుకుంటే బడ్జెట్ పరిధి మరో 10 నుంచి 20 లక్షలు పెరిగేది. అయినా అంత పెద్ద మొత్తం వసూళ్లు వచ్చేవి. అప్పట్లో 15కోట్లతో 'ఛత్రపతి' ఛత్రపతి సినిమాని అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేయగలిగాం. టీమ్‌తో ప్రతిదీ మాట్లాడడం వల్ల బడ్జెట్ పరిధి దాటకుండా అదుపులో పెట్టుకోగలిగాం. ఇటీవలి కాలంలోనూ బడ్జెట్‌ల విషయంలో ప్రణాళికతోనే ఉంటున్నారంతా. అనుకోనిది ఏదైనా జరిగితే తప్ప అదనపు ఖర్చు ఏమీ లేదు. లిమిటేషన్ క్రాస్ చెయ్యడం అనేదేం లేదు.
ప్రశ్న: ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' విశేషాలు?
జ : ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో షూటింగ్ 70శాతం పూర్తయింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నాం. కథ డిమాండ్ మేరకు లండన్, స్పెయిన్ లాంటి చోట తెరకెక్కిస్తున్నాం. ఈనెల 20 నుంచి స్పెయిన్‌లో కొత్త షెడ్యూల్ మొదలవుతోంది. ఎన్టీఆర్ అభిమానులకు ఇదో విజువల్ ట్రీట్ అవుతుంది. సుకుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అంటూ ఇంటర్వ్యూ ముగించారు 'ఛత్రపతి' ప్రసాద్.
ప్రశ్న: కొత్త ప్రాజెక్ట్‌లు?
జ : ముందు ఈ సినిమా పూర్తయ్యాక ఆలోచిద్దాం.. ఏదైనా.. ఎవరు ఏ సినిమా తీస్తారో చెప్పలేం. ఒక నిర్మాత ఒక హీరోతో చేయాలని భంగపాటు పడ్డ సందర్భాలున్నాయి. అంతా ఓకే అయ్యాక. రాత్రికి రాత్రే సీన్ మారిపోవచ్చు.. అంటూ ముగించారు.

