గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జనవరి 2026 (18:56 IST)

బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందా? రెహ్మాన్‌ను నిలదీసిన కంగనా రనౌత్

kangana ranuth
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మతపరమైన వివక్ష ఉందంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా మండిపడ్డారు. రెహ్మాన్‌ను ఆమె విద్వేషపూరిత వ్యక్తిగా విమర్శించారు. పైగా, తాను నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రానికి సంగీతం వహించేందుకు నిరాకరించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇటీవల రెహ్మన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్ల కాలంలో బాలీవుడ్‌లో పెద్ద మార్పు జరిగిందన్నారు. ఇది మతపరమైన అంశం కావొచ్చని అభిప్రాయపడ్డారు. దీనివల్లే తనకు బాలీవుడ్‌లో పని తగ్గిందని, ఈ విషయం తనకు పరోక్షంగా తెలిసిందన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. 
 
వీటిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. ప్రియమైన రెహ్మాన్ గారూ... 'నేను కాషాయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో ఎన్నో వివక్షలు, పక్షపాతాలు ఎదుర్కొంటున్నాను. కానీ, నా జీవితంలో మీలాంటి ద్వేషపూరిత, పక్షపాత వైఖరి ఉన్న వ్యక్తిని ఎపుడూ చూడలేదు' అని ఆమె తీవ్రంగా విమర్శించారు. 
 
తాను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రానికి సంగీతం అందించమని రెహ్మాన్‌ను సంప్రదించానని, అయితే, ఆయన కనీసం కథ వినడానికి కూడా ఇష్టపడలేదని కంగనా ఆరోపించారు. నేను మీకు కథ చెప్పాలనుకున్నాను. కానీ కథ చెప్పడం అటుంచి, నన్ను కలవడానికి మీరు నిరాకరించారు. అది ఒక వర్గానికి సంబంధించిన ప్రచార చిత్రం అని భావించి అందులో భాగం కావడానికి మీరు ఇష్టపడలేదని నాకు తెలిసింది అని పేర్కొన్నారు.