1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Parthiban Krishnamurthy cycled 100 km daily for food delivery is now a CA

నాడు పుడ్ డెలివరీ బాయ్... నేడు సీఏ విజేత

Parthiban Krishnamoorthi
నిరంతర కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తమిళనాడుకు చెందిన ఓ యువకుడు నిరూపించాడు. గడ్డకట్టే చలిలో కిరాణా సరుకులను ప్యాక్ చేస్తూ, సైకిల్‌పై తిరుగుతూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూనే సీఏ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఒకప్పుడు ఏ కార్యాలయాన్ని చూసి ముచ్చటపడ్డాడో, నేడు అదే సంస్థలో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
 
తమిళనాడులోని కాంచీపురానికి చెందిన పార్తిబన్ కృష్ణమూర్తి తన కుటుంబంలోనే తొలి పట్టభద్రుడు. సీఏ ఫౌండేషన్‌ను మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించినప్పటికీ, సీఏ ఇంటర్ పరీక్షల్లో రెండుసార్లు విఫలమయ్యాడు. అయినప్పటికీ కుంగిపోకుండా, ఉన్నత చదువుల కోసం తన సొంత ఖర్చుల నిమిత్తం బెంగళూరుకు చేరుకున్నాడు. 
 
అక్కడ జెప్టో స్టోరులో నైట్ షిఫ్టులో ఆర్డర్ ప్యాకర్‌గా విధులు నిర్వహించాడు. అనంతరం బ్లింకిట్‌లో డెలివరీ పార్ట్‌‌నర్‌గా చేరి, నెలకు రూ.600 అద్దెకు తీసుకున్న సైకిల్‌పై ప్రతిరోజూ దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఇలా డెలివరీల మధ్య లభించే స్వల్ప విరామ సమయాన్ని వృథా చేయకుండా సీఏ పాఠాలు వినేవాడు.
 
పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమించి, ఈ ఏడాది మార్చి 8న సీఏ ఇంటర్మీడియట్ రెండు గ్రూపులను విజయవంతంగా పూర్తి చేశాడు. ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే నాలుగు ప్రముఖ సంస్థల నుంచి అతడికి ఇంటర్వ్యూ పిలుపులు అందగా, బీడీవో సహా మూడు సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. దీంతో ఏప్రిల్ 2వ తేదీన బెంగళూరులోని బీడీవో కార్యాలయంలో ఆర్టికల్ అసిస్టెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. 
 
గతంలో ఏ కార్యాలయం వెనుక ఉన్న పార్కులో తాను విశ్రాంతి తీసుకునేవాడో, అదే సంస్థలో ఇప్పుడు ఉద్యోగిగా చేరడం పట్ల పార్థీబన్ హర్షం వ్యక్తం చేశాడు. సీఏ ఫైనల్ పరీక్షలు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని పేర్కొంటూ.. వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దని తోటి విద్యార్థులకు హితవు పలికాడు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'అందరినీ ప్రేమించు - అందరినీ సేవించు' సందేశాన్ని ఆచరించాలి : సీఎం చంద్రబాబు