నీరసంగా ఉందా..? సమయానికి నిద్రపోండి.. లేకుంటే కష్టమే!
నీరసం ప్రస్తుతం అందరినీ వేధించే సమస్య. యాంత్రిక జీవితానికి అలవాటుపడి అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నాం. పోషకాహారం తీసుకోకపోవడం.. ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడం నీరసానికి ప్రధాన కారణమవుతోంది. నీరసానికి సంబంధించిన లక్షణాలు ఎలావుంటాయంటే తలనొప్పి, కడుపులో వికారంగావుండటం, కండరాల నొప్పులు, ఏ విషయానికీ త్వరగా స్పందించక పోవటం, మూడీగా ఉండటం, ఆకలి మందగించటం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం వంటివని వైద్యులు పేర్కొన్నారు. దీన్ని అధికమించాలంటే కొన్ని పాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు చెపుతున్నారు.
* శరీరంలో నీరు లేకపోయినా నిస్సత్తువ ఆవహిస్తుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగండి.
* కార్బోహైడ్రేట్లు ఎక్కువగావున్న ఆహారం, తృణ ధాన్యాలతో కూడిన ఆహారాన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అతిగా డైటింగ్ చేయడం వల్ల కూడా శరీరంలోని శక్తి హరించుకుపోతుంది. దీంతో నీరసం ఆవహిస్తుంది.
* ఒకేసారి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. మహిళలు తీసుకునే ఆహారంలో ఐరన్ మోతాదు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
* నిద్ర లోపాలను సవరించుకుని తగినంతగా నిద్ర పోవడానికి ప్రయత్నించండి. నిద్ర పట్టడానికి వాడే మాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
* మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటే మంచిది. భౌతిక వ్యాయామం తగినంతగా ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సినంత నిద్ర లభిస్తుంది.
* ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. కాబట్టి కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయటం, టీవీ చూడటం వంటివి కాస్త తగ్గించండి.
* దీర్ఘ కాలికంగా డిప్రెషన్, యాంగ్జైటీ కలిగిస్తున్న కారణాలు మీ జీవితంలో ఏమున్నాయో గుర్తించండి. ఆ తర్వాత వాటితో రాజీపడటమో లేక కౌన్సిలింగ్ సహాయం తీసుకోవడమో చేయండి.
* జీవితాన్ని హాయిగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి. రోజూ కనీసం 10 నిముషాలైనా నడవండి. శరీరానికి సరైన ఆహారం, వ్యాయామం, మనసుకు తగినంత ప్రశాంతత ఉంటే నీరసం, నిస్సత్తువ మీ దరికి చేరదంటున్నారు వైద్యులు.
