1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. ISRO Successfully Launches GSLV F17 Rocket Carrying Imaging Satellite EOS-05

ఇస్రో ఖాతాలో మరో విజయం - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్17

gslv f17
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రక ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జీఎస్ఎల్వీ ఎఫ్17ను వాహకనౌక ద్వారా అడ్వాన్స్‌డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశింత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష సామర్థ్యం మరో మెట్టు పైకెక్కినట్లయింది.
 
భూస్థిర కక్ష్య నుంచి పనిచేయనున్న భారత్ తొలి ఇమేజింగ్ శాటిలైట్ ఇదేకావడం ఈ ప్రయోగం ప్రత్యేకత. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ, భూభ్రమణంతో పాటే ఇది తిరుగుతుంది. దీనివల్ల భారత ఉపఖండం, పరిసర ప్రాంతాలపై నిరంతరం ఒక కన్ను వేసి ఉంచడం సాధ్యమవుతుంది. సాధారణంగా లోయర్ ఎర్త్ ఆర్బిట్లోని ఉపగ్రహాలు ఒక ప్రాంతంపై నుంచి పరిమిత సమయం మాత్రమే వెళ్తాయి. కానీ, ఈ ఎస్-05 స్థిరంగా ఒకే ప్రాంతాన్ని పర్యవేక్షించగలదు.
 
ఈ ఉపగ్రహం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి మొత్తం భారత భూభాగాన్ని చిత్రీకరించగలదు. ప్రకృతి వైపరీత్యాలైన తుఫానులు, వరదలు, అడవుల్లో కార్చిచ్చులను ముందుగా పసిగట్టడంలో, వాతావరణ మార్పులను గమనించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయం, జలవనరుల నిర్వహణ, సరిహద్దు ప్రాంతాల పర్యవేక్షణలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది.
 
ఐదేళ్ల క్రితం, అంటే 2021 ఆగస్టులో, జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ సాంకేతిక వైఫల్యం కారణంగా జిశాట్-1 (ఈవోఎస్-03) మిషన్ విఫలమైన విషయం తెలిసిందే. ఆ లోటును పూడ్చుతూ, ఇప్పుడు ఈవోఎస్-05 ను విజయవంతంగా ప్రయోగించి ఇస్రో తన సత్తా చాటింది.
 
ప్రస్తుతం ఉపగ్రహం సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్లో లో ఉందని, దాని సోలార్ ప్యానెళ్లు తెరుచుకొని పనిచేస్తున్నాయని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో దశలవారీగా కక్ష్యను పెంచుతూ, దానిని తుది భూస్థిర కక్ష్యలో ప్రవేశపెడతారు. ఈ ప్రయోగం భారత భూపర్యవేక్షణ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రూ.కోట్ల ఆస్తి అక్కకు దక్కదని బావను హత్య చేయించిన బామ్మర్ది.. ఎక్కడ?