కిడ్నీదానం చేసి భర్తను బతికించుకున్న మహిళ.. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది...
రెండు కిడ్నీలు పాడైపోయిన భర్తకు తన కిడ్నీదానం చేసి బతికించుకుంది ఆ మహిళ. స్వగ్రామంలో తన కోడలి సీమంతానికి ఇద్దరు కుమారులతో కలిసి బయలుదేరింది. అంతలోనే విధి పగబట్టింది. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. లారీ అదుపుతప్పి కారుపై పడింది. తల్లి, ఇద్దరు కుమారులు దర్మరణం పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ప్రకాశం జిల్లాలో జరిగింది.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం, పెద్తకొత్తపల్లికి చెందిన షేక్ కుద్దూస్, నజీరా (46) అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు కుమారులు. నూరుల్లా (26), హబీబుల్లా (24)లు ఉన్నారు. పెద్ద కుమారుడు నూరుల్లా హైదరాబాద్ నగరంలో టెక్కీగా పనిచేస్తున్నాడు. గత యేడాది చీమకుర్తికి చెందిన నఫ్సీమాను వివాహం చేసుకున్నారు. చిన్న కుమారుడు అన్న వద్దే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఖుద్దూస్‌కు రెండు కిడ్నీలు పాడాపోయాయి. దీంతో భర్తను కాపాడుకునేందుకు నజీరా కిడ్నీ దానం చేసింది. గత నెల 23వ తేదీన హైదరాబాద్ నగరంలో విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.
ఇదిలావుంటే వీరి కోడల నఫ్సీమా గర్భిణి కావడంతో ఈ నెల 20వ తేదీన పెద్దకొత్తపల్లిలో సీమాంతం నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తల్లీ, కుమారులిద్దరూ శనివారం రాత్రి కారులో బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున పెద నెమలిపురికి చేరుకున్నారు. అదే సమయంలో నెల్లరూ నుంచి ఫ్లైయాష్ లోడుతో వెళుతున్న లారీ ఒకటి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, అవతలి రోడ్డులో వెళుతున్న కారుపై బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో నజీరా, హబీబుల్లాలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. నూరుల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రామాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.