శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (19:49 IST)

మందు బాబుల గగ్గోలును ఆలకించిన సీఎం జగన్... మద్యం ధరలు తగ్గింపు

ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు అడ్డగోలుగా ఉన్నాయంటూ మద్యం బాబులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా, సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీటి ధరలను ఏకంగా 75 శాతం మేరకు పెంచేశారు. అయితే, మద్యం ధరలు అధికంగా ఉన్నాయంటూ తాగుబోతులు ఆవేదన చెందుతున్నారు. వీరి ఆవేదనను సీఎం జగన్ ఆలకించి, వారిపట్ల కరుణ చూపించారు. ఇందులోభాగంగా, రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మీడియా, ప్రీమియం కేటగిరీ మద్యం ధరలను ఏకంగా 25 శాతం తగ్గిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తగ్గిన ధరలు శుక్రవారం నుంచి అక్టోబరు 30వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
కరోనా వైరస్ ప్రభావం కారణంగా విధించిన లాక్డౌన్‌ ఎత్తివేత మొదలైన జూన్ నెలలో ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను అనూహ్యంగా పెంచింది. మద్యం వినియోగం తగ్గాలనే ఉద్దేశంతోనే సర్కార్ ఆ నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రభుత్వాధినేతలు, అధికార పార్టీనే నాయకులు చెప్పారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలో వైన్సులను, బార్ల సంఖ్యను బాగా తగ్గించింది ప్రభుత్వం. అయితే.. మద్యం ధరలు భారీ స్థాయిలో వుండటం, రెగ్యులర్‌గా తమకు అలవాటైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగునే వున్న తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించే వారి సంఖ్య పెరిగిపోయింది. 
 
ఈ అక్రమ మద్యం తెలంగాణ సరిహద్దులో ఉన్న జిల్లాల నుంచి ఏకంగా తెలంగాణకు దూరంగా వున్న కడప, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లోను భారీ ఎత్తున లభ్యమవుతున్న పరిస్థితి. తాజాగా గత రెండు, మూడు రోజులుగా చిత్తూరు, కడప జిల్లాల్లో తెలంగాణ నుంచి అక్రమంగా తరలించిన మద్యం పట్టుబడింది. 
 
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 250 నుంచి 300 రూపాయల మధ్యన అమ్ముడయ్యే మద్యం ధరల్లో 50 రూపాయలు తగ్గుదల కనిపిస్తుంది. భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం, విదేశీ మద్యం మద్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరల తగ్గించారు. 
 
50 రుపాయల నుంచి 1350 రూపాయల వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరల తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు అక్టోబరు 30 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నారు. అదేవిధంగా 200 రూపాయలులోపు క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పు లేదని సర్కారు జీవోలో పేర్కొంది.