ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 2905 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 88,778 కరోనా టెస్టులు నిర్వహించగా 2,905 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 494 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి.
అదేసమయంలో 16 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,659కి పెరిగింది. తాజాగా, 3,243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,17,679కి చేరుకుంది. ఇప్పటివరకు 7,84,752 మంది కరోనా విముక్తులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 26,268 మాత్రమే.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,504 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,436 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,35,656 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,16,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,324 కి చేరింది. ప్రస్తుతం 17,979 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,938 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 288 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 115 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇదిలావుంటే, దేశంలో కరోనా కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 49,881 మందికి కరోనా నిర్ధారణ అయిందని పేర్కొంది. అదేసమయంలో 56,480 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,40,203 కి చేరింది.
గత 24 గంటల సమయంలో 517 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,20,527కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 73,15,989 మంది కోలుకున్నారు. 6,03,687 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 10,65,63,440 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,75,760 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.