ప్రతి వ్యక్తికీ కరోనా టీకా.. ఇది నా భరోసా : ప్రధాని మోడీ

narendra modi
ఠాగూర్| Last Updated: గురువారం, 29 అక్టోబరు 2020 (16:27 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అనేక దేశాలు టీకాల తయారీలో నిమగ్నమైవున్నాయి. అయితే, ఈ టీకాలు అందుబాటులో వచ్చేందుకు ఎంతో సమయం పట్టదని అనేక మంది శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు భరోసానిచ్చే వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ప్రజలందరికీ అందిస్తామన్నారు. మొదటి ప్రాధాన్యంగా బలహీనమైన వారికి, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకా వేయడంపై దృష్టి పెట్టినప్పటికీ, దేశంలో ఏ ఒక్క పౌరుడిని విడిచిపెట్టకుండా కరోనా టీకా అందిస్తామని ప్రధాని మరోమారు హామీ ఇచ్చారు.

వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందనీ, ట్రయల్స్ కొనసాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసామన్నారు. వ్యాక్సిన్ మోతాదు తదితర మార్గదర్శకాలను ఈ నిపుణుల బృందం నిర్ణయిస్తుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

కరోనా మహమ్మారి టీకా ప్రతి వ్యక్తికి చేరేలా 28 వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లును సిద్ధం చేయనున్నామని వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో ఏర్పాటు చేసిన బృందాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా టీకా పంపిణీని పర్యవేక్షిస్తాయన్నారు. అలాగే లబ్ధిదారుల నమోదు, టీకాలను వేసేందుకు ఒక డిజిటల్ వేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని తెలియజేశారు.

వైరస్ ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదు. ఒకసారి గుజరాత్, మరోసారి కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నాం.
అంతలోనే పరిస్థితి అదుపులో ఉన్నట్లు అనిపిస్తుంది.. మళ్లీ కొన్ని నెలల తర్వాత అధ్వాన్నంగా మారుతోందని ప్రధాని వివరించారు.

అందుకే అక్టోబరు 20వ తేదీన దేశానికి తాను ఇచ్చిన సందేశంలో చెప్పినట్టుగానే ఫేస్ మాస్క్, చేతులను శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.దీనిపై మరింత చదవండి :