శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (16:19 IST)

ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ గురువు ఇకలేరు...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ గురువు, గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 యేళ్లు. అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
 
జులై 24, 1928లో జునాగద్‌ జిల్లాలోని విశవదార్‌ పట్టణంలో పటేల్‌ జన్మించిన ఆయన.. 1945లో ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారకునిగా చేరారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు సైతం వెళ్లారు. 1960లో జనసంఘ్‌లో కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 
 
1977లో రాజ్‌కోట్‌ నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం తన పదవికి రాజీనామా చేసి బాబుభాయ​ పటేల్‌ 'జనతా మోర్చ్‌' ప్రభుత్వంలో చేరారు. 1978నుంచి 1980వరకు వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. 1995లో మొట్టమొదటి సారిగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
 
అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల 7 నెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1998 మార్చి నెలలో మరోసారి సీఎం పదవిని చేపట్టారు. అనారోగ్య కారణాల దృష్ట్యా మరోసారి 2001లో పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యం వల్ల గత కొన్ని సంవత్సరాలనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత నెలలో ఆయన కరోనా వైరస్‌ బారిన పడికోలుకున్నారు.
 
అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రానికే చెందిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన రాజకీయ గురువు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా ఉన్న సమయంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. అంతేనా, ఎంపీగా నరేంద్ర మోడీ విజయం సాధించిన తర్వాత తొలుత కేశుభాయ్ పటేల్ వద్దకే వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన దేశ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. వారిద్దరి మధ్యా అలాంటి బంధం ఉండేది. 

కేశూజీ మరణం మౌనాన్ని నింపింది... మోడీ 
కాగా, మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో మెసెజ్ పోస్టు చేసిన ప్రధాని మోడీ.. కేశూభాయ్ ప‌ట్ల ఉన్న త‌న అభిమానాన్ని వ్య‌క్తం చేశారు. తన లాంటి ఎంద‌రో కార్య‌క‌ర్త‌ల‌ను కేశుభాయ్ తీర్చిదిద్దార‌ని అన్నారు.
 
ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట‌ప‌డేవార‌న్నారు. కేశుభాయ్ మ‌ర‌ణం తీర‌ని లోటు అని, ఆయ‌న కుటుంబ‌ స‌భ్యులు, శ్రేయోభిలాషుల‌కు సంతాపం తెలుపుతున్నాన‌ని, కేశూ కుమారుడు భ‌ర‌త్‌తో మాట్లాడిన‌ట్లు ప్ర‌ధాని మోడీ త‌న వీడియో ట్వీట్‌లో తెలిపారు.
 
గుజ‌రాతీ నేల‌కు చెందిన ప్రియ‌త‌మ నేత కేశుభాయ్ మ‌ర‌ణ వార్త‌ను ఊహించ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. చాలా దుఖం వేస్తోంద‌ని, ఆయ‌న మ‌ర‌ణం త‌న‌లో మౌనాన్ని నింపిన‌ట్లుగా వెల్ల‌డించారు. కేశూజీ మ‌ర‌ణం త‌న‌కు ఓ తండ్రిని కోల్పోయిన‌ట్లు ఉంద‌న్నారు.
 
దేశ భ‌క్తి ల‌క్ష్యంతో కేశూ ప‌నిచేశారని ఆయ‌న వ్య‌క్తిత్వం, వ్య‌వ‌హారంలో సౌమ్య‌త‌, నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో దృఢ నిశ్చ‌య శ‌క్తి అచంచ‌ల‌మైంద‌ని ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన కేశుభాయ్‌.. రైతులు, పేద‌ల క‌ష్టాల‌ను అర్థం చేసుకునేవార‌న్నారు. కేశూజీ వివిధ హోదాల్లో త‌న నిర్ణ‌యాల‌తో రైతుల‌కు ఎంతో మేలు చేశార‌న్నారు. రైతుల జీవితాల‌ను సుల‌భ‌‌తరం చేశార‌న్నారు.