శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (09:07 IST)

కరోనా వైరస్ సోకి మరణించిన భర్త.. తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే....

హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భర్త కరోనా వైరస్‌తో మరణించడాన్ని ఆ భార్య జీర్ణించుకోలేక పోయింది. తన భాగస్వామి లేని జీవితం వ్యర్థమని భావించింది. అంతే.. భర్తలేని ఈ లోకంలో తాను ఉండలేనని తీర్మానించుకున్న ఆ భార్య... భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లాకు చెందిన తడకమల్ల వెంకటేశ్ (56), ధనలక్ష్మి (55) అనే దంపతులు ఉన్నారు. వీరికి పిల్లలు లేరు. ఈ క్రమంలో నాలుగేళ్ళ క్రింత హైదరాబాద్ నగరానికి పొట్ట చేతపట్టుకుని వలస వచ్చి, సైనిక్‌పురిలోని అంబేద్కర్ నగర్‌లో ఉంటున్నారు. 
 
భర్త కూలి పని చేస్తుండగా, భార్య ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం వెంకటేశ్ అనారోగ్యం బారినపడ్డాడు. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని రావడంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం వెంకటేశ్‌కు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో మరణించాడు. 
 
సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన విధులు ముగించుకుని సూపర్ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన భార్య ధనలక్ష్మి.. భర్త మరణించి ఉండడాన్ని గమనించి తీవ్ర మనస్తాపానికిగురైంది. భవనం మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకేసింది. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం మిగిలించింది.