మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (15:19 IST)

జోరుగా మతమార్పిడులు... 1.8 శాతం నుంచి 25 శాతం పెరుగుదల...

వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతమార్పిడులు జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. ఈయన కేవలం ఆరోపణలు మాత్రమే చేయడం లేదు.. ఏకంగా గణాంకాలను సైతం వెల్లడిస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీలో మత మార్పిడి యథేచ్చగా జరుగుతోందని పేర్కొంటూ ఆయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 2011లో ఏపీలో క్రిస్టియన్ల జనాభా 1.8 శాతంగా ఉందని... ఇప్పుడు అది 25 శాతం వరకు పెరిగిందని గుర్తు చేశారు. 
 
ముఖ్యంగా, గత రెండున్నరేళ్ళలో ఈ జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. దీనికి కారణం మతమార్పిడులేనని చెప్పారు. అయితే ఇది ప్రభుత్వ రికార్డుల్లోకి రావడం లేదని చెప్పారు. ప్రజాధనాన్ని క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగిస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని చెప్పారు.  
 
ఇకపోతే, రాష్ట్రంలోని 30 వేల మంది చర్చి పాస్టర్లకు నెలకు రూ.5 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని రఘురాజు తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో దాదాపు 33 వేల చర్చిలు ఏర్పాటైనట్టు తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. హిందూ దేవాలయాలకు సమానంగా చర్చిలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.