సంక్రాంతి పండగపూట ఆంధ్రాలో ఆర్టీసీ సమ్మె సైరన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానులు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ పూట ఈ సమ్మె ప్రకటన ప్రభుత్వ వర్గాలతో పాటు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆర్టీసీలో అనేక అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సులకు అద్దె పెంచాలని డిమాండ్ చేస్తూ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేయనున్నట్టు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల తనపై అదనపు భారం పడుతోందని యజమానులు వాపోతున్నారు. మరోవైపు, పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులతో నష్టాలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో అద్దె పెంచడం తప్పనిసరి అని వారు వాదిస్తున్నారు.
ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. యాజమాన్యం నెలకు అదనంగూ రూ.5200 ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఈ పెంపు చాలా స్వల్పమని యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమతో చర్చించి అద్దెను మరింత పెంచాలని కోరుతూ ఈ సమ్మె ప్రకటన చేశారు.
