గురువారం, 20 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (08:18 IST)

ఏపీకి పొంచివున్న మరో తుఫాను గండం ... రానున్నరోజుల్లో భారీ వర్షాలే

Rains
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్ష ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా వచ్చే రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో వరి పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటం రైతులు ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది క్రమంగా బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలు ఇవ్వడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. 
 
ఐఎండీ ప్రకారం 22వ తేదీన ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి 24వ తేదీ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుంది. అయితే, ఇది తుఫానుగా మారుతుందా లేదా అనే విషయంపై ఐఎండీ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల 25వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడి దక్షిణ కోస్తాలో తీరందాటే అవకాశం ఉంది. 
 
ఇదిలావుండగా, రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కృష్ణ, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 
 
మరోవైపు, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముఖ్యంగా మన్యం ఏజెన్సీ గజగజ వణికిపోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులో బుధవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 5.8 డిగ్రీలుగా నమోదైంది. ఈ చలి ప్రభావం మరో రెండు, మూడు రోజులు కొనసాగి ఆ తర్వాత తగ్గుతుందని అధికారులు తెలిపారు.