నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదులను అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ నదుల అనుసంధాన ప్రక్రియలో ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన కార్యాన్ని మాత్రం పూర్తి చేసి తీరుతామన్నారు.
వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదిక నుంచి అన్నదాతా సుఖీభవ - పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.
'గతంలో కడపలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేశారు. మహానాడు ద్వారా కడప గడ్డ మీద తెదేపా సత్తా ఏంటో నిరూపించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం. హమీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. ఇప్పటివరకు 46.85లక్షల మంది రైతులకు రూ.14 వేల చొప్పున జమ చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం. రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.
సాగు తీరు మారాలి.. వ్యవసాయం లాభసాటి కావాలి. అన్నదాతల బతుకులు మారాలి. ప్రకృతి సేద్యంలో ఎవరు ముందుంటే.. వారిదే భవిష్యత్తు. రైతుల అభివృద్ధి కోసం పంచసూత్రాలు తీసుకొచ్చాం. వాటిని అమలు చేస్తే.. రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నేనూ రైతు బిడ్డనే.. మా నాన్నకు వ్యవసాయంలో సహాయం చేసేవాడిని. పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తామంటే.. రైతుకు ఇబ్బందులు వస్తాయి. రైతులు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలి. మనం పండించిన పంటలను ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలి. అలా అయితేనే రైతులకు ఆదాయం వస్తుంది.
విధ్వంసమైన రాష్ట పునర్నిర్మాణం కోసమే.. నాడు పొత్తు పెట్టుకున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం. కృష్ణా, గోదావరితో పాటు అనేక నదులు ఉన్నాయి. నదుల అనుసంధానం ద్వారా అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నింపగలిగితే.. ఒక యేడాది వర్షం పడకపోయినా బ్యాలెన్స్ అవుతుంది. అన్ని చెరువులు నింపాలి, భూగర్భ జలాలు పెంచాలి. భూమిని ఒక జలాశయంగా మార్చాలి' అని సీఎం అన్నారు.