పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య .. ఎక్కడ?
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని ఒత్తిడితో గ్రేడ్-2 కేడర్‌కు చెందిన వీఆర్వో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని ఒత్తిడితో పాటు పై అధికారుల వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కర్నూలు పట్టణంలో రెవెన్యూ అధికారిగా షేక్ మహ్మద్ హుస్సేన్ (49) నగరంలోని 30వ సచివాలయంలో గ్రేడ్-2 కేటగిరీలో పనిచేస్తున్నారు. ఆయన శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉన్నతాధికారుల నుంచి విపరీతమైన పని ఒత్తిడి పెరగడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా, రెవెన్యూ సిబ్బందితో కలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
దీంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులపై పనిభారం పెరిగిపోతోందని, ఈ సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీఆర్వో ఆత్మహత్యకు దారితీసి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
