1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Iranian drone attacks on Kuwait and Bahrain after US attacks on Iran

బహ్రెయిన్ - కువైట్‌ లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడులు

Iran Shoots Down Very Big Aircraft with a Small Missile
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌, డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడులను అమెరికా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టడమేకాకుండా, ప్రతీకారంగా ఇరాన్‌లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. కొంతకాలంగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రయత్నాలకు ఈ తాజా పరిణామాలు గట్టి ఎదురుదెబ్బగా పరిణమించాయి.
 
అమెరికా సెంట్రల్ కమాండ్ కథనం ప్రకారం.. హార్ముజ్ జలసంధిలో నాలుగు ఇరాన్ డ్రోన్లను కూల్చివేసిన కొద్ది గంటల్లోనే ఈ క్షిపణుల దాడి చోటుచేసుకుంది. బహ్రెయిన్, కువైట్ల వైపు ఇరాన్ మొత్తం ఏడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా, వాటిలో ఆరింటిని తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, ఏడో క్షిపణి లక్ష్యాన్ని చేరలేదని అమెరికా వెల్లడించింది. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం సహా ఇతర సైనిక స్థావరాలపై దాడులు చేశామన్న ఇరాన్ వాదనలను అమెరికా తోసిపుచ్చింది. తమ సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
 
ఈ దాడులకు ప్రతిచర్యగా అమెరికా దళాలు ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోని గొరుక్, క్వెష్ దీవుల్లో ఉన్న ఇరాన్ కోస్టల్ సర్వేలెన్స్ రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. భవిష్యత్తులో ఇటువంటి దాడులను నివారించేందుకు, ఆత్మరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా వివరించింది.
 
మరోవైపు, కువైట్‌లోని అలీ అల్ సేలం ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా నావికా స్థావరాలే తమ ప్రధాన లక్ష్యాలని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఇరాన్ దుశ్చర్యలను బహ్రెయిన్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. తాజా దాడుల నేపథ్యంలో కువైట్ తన గగనతల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. వివాద పరిష్కారానికి దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ తరహా దాడులు పునరావృతం కావడం గల్ఫ్ ప్రాంతంలో శాంతిస్థిరత్వాలకు ముప్పుగా పరిణమించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బీజేపీ జోక్యాన్ని నివారించేందుకే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చాం : ఎంకే స్టాలిన్