సోమవారం, 30 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 30 మార్చి 2026 (14:35 IST)

అనకాపల్లిలో ఏసీ పేలి వ్యక్తి మృతి, ఏసీలు ఎందుకు పేలతాయి? కారణాలు

Why Do ACs Explode
అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో విషాదం చోటుచేసుకున్నది. రేబాక రామారావు అనే విశ్రాంత ఉద్యోగి ఇంట్లో ఏసీ పేలి అతడు మృత్యువాత పడ్డాడు. మిగిలిన కుటుంబసభ్యులు తృటిలో తప్పించుకున్నారు. అసలు ఎండాకాలంలో ఏసీలు బాంబుల్లా ఎందుకు పేలతాయి? దీని వెనుక ఉన్న ప్రధాన సాంకేతిక కారణాలు, మనం చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాము.
 
ఏసీల్లో వాడే గ్యాస్, ముఖ్యంగా పాత మోడల్స్‌లో వాడే R-22 లేదా కొత్త వాటిలో వాడే R-32 గ్యాస్ చాలా ప్రమాదకరమైనవి. గ్యాస్ పైపుల్లో చిన్న లీక్ ఉన్నప్పుడు, ఆ గ్యాస్ బయటకు వచ్చి లోపల ఉన్న ఎలక్ట్రికల్ స్పార్క్‌.. అంటే చిన్న నిప్పురవ్వ తగిలితే ఒక్కసారిగా మంటలు చెలరేగి ఏసీ పేలిపోతుంది. 
 
ఏసీ అనేది చాలా ఎక్కువ విద్యుత్ తీసుకునే పరికరం. కాబట్టి ఏసీకి సరిపడా కెపాసిటీ లేని పల్చటి వైర్లు వాడటం వల్ల అవి వేడెక్కి కాలిపోతాయి. వోల్టేజ్ ఒక్కసారిగా పెరిగినా లేదా తగ్గినా ఏసీ సర్క్యూట్ బోర్డులు కాలిపోయి పేలుడుకు దారితీస్తాయి. కనుక స్టెబిలైజర్ వాడాలి.
 
ఏసీకి గుండె లాంటిది కంప్రెసర్. ఇది బయట ఔట్ డోర్ యూనిట్లో వుంటుంది. అవుట్ డోర్ యూనిట్ చుట్టూ గాలి సరిగ్గా ఆడటానికి ఖాళీ లేకపోయినా లేదా దానిపై నేరుగా తీవ్రమైన ఎండ పడుతున్నా కంప్రెసర్ విపరీతంగా వేడెక్కుతుంది. ఒక స్థాయికి మించి వేడి పెరిగినప్పుడు లోపల ప్రెషర్ తట్టుకోలేక కంప్రెసర్ పేలిపోతుంది.
 
మరొక కారణం రెగ్యులర్ సర్వీసింగ్ చేయించకపోవడం, మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏసీని సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోవడం. ఏసీ ఫిల్టర్లు, కాయిల్స్ మీద దుమ్ము పేరుకుపోతే, గాలి లోపలికి వెళ్లక కంప్రెసర్ మీద విపరీతమైన భారం పడుతుంది. ఇది మెల్లగా వేడిని పెంచి ప్రమాదానికి దారితీస్తుంది. అలాగే ఏసీని బిగించేటప్పుడు గ్యాస్ ప్రెషర్‌ను సరిగ్గా చెక్ చేయకపోవడం లేదా పైపుల మధ్య కనెక్షన్స్ వదులుగా ఉండటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి.
 
ప్రమాదాలను అరికట్టాలంటే... రెగ్యులర్ సర్వీసింగ్ చేయిస్తుండాలి. ఏసీని వాడటం మొదలుపెట్టే ముందు, మధ్యలో కనీసం సంవత్సరానికి రెండుసార్లు నిపుణులైన టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించాలి. ఏసీకి కనీసం 4sq mm వైరింగ్, మంచి క్వాలిటీ ఉన్న MCB స్విచ్ వాడాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి ఏసీని కాపాడుకోవడానికి మంచి Voltage Stabilizer తప్పనిసరి. బయట ఉండే యూనిట్ మీద గాలి తగిలేలా చూసుకోవాలి. దాని మీద నేరుగా ఎండ పడకుండా చిన్న షెడ్డు లాంటిది ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది.
 
పాత ఏసీలు: 10 ఏళ్లకు పైబడిన ఏసీలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వీలైతే వాటిని మార్చేయడం మంచిది. ఏసీ నుంచి ఏదైనా వింత శబ్దం వస్తున్నా లేదా గది సరిగ్గా కూలింగ్ అవ్వకపోయినా వెంటనే ఆపివేసి మెకానిక్‌ను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తేనే ప్రమాదాలు జరుగుతాయి.