1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Sai Krishna Custodial Case Update: 2 Head Constables Surrender

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

appolice
విజయవాడలో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషనులో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న అశోక్‌, నానిలు సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు వీరిద్దరూ వెన్నంటి ఉండేవారు. సాయికృష్ణ మృతి వ్యవహారంలో అశోక్‌, నానిలు సీఐ నాగరాజుకు సహకారం అందించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గుర్తించింది. ఈ క్రమంలో ఈ కేసులో సీఐ నాగరాజును సిట్ అరెస్టు చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారిద్దరూ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
 
రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కానిస్టేబుల్ అరెస్టు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్టు చేసిన సిట్ అధికారులు... తాజాగా సోమవారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్టు చేశారు.
 
సాయిష్ణ లాకప్ డెత్ అంశంపై బాబురావును విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి లోతైన విచారణ కోసం కస్టడీకి కోరనున్నారు. పోలీస్ స్టేషన్ లాకప్ సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ టార్చర్ బాబురావు పాత్ర కూడా ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది. తీవ్రంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మరణించాడని తేలడంతో బాబురావును అరెస్టు చేశారు.
 
మరోవైపు, సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషనుపై అత్యంత కీలకమైన విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సాయికృష్ణను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు గతంలోనే పోలీసులను ఆదేశించింది.
 
హైకోర్టు సీరియస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం ఆ దర్యాప్తులో పోలీసులే సాయికృష్ణను కొట్టి చంపేసి బాడీని మాయం చేశారనే విషయం బయటపడింది. దాంతో అప్పటివరకు కేవలం 'మిస్సింగ్ కేసు'గా ఉన్న ఈ కేసు లాకప్ డెత్ కేసుగా మారింది. 
About Writer
ఠాగూర్