గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:06 IST)

టిటిడి కాంట్రాక్ట్ కార్మికుల అరెస్టు... అప్రజాస్వామికమ‌న్న‌ సిఐటియు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల‌ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయమని కోరుతూ చేస్తున్న నిర‌స‌న‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. శాంతియుతంగా, గోవింద నామస్మరణ చేస్తూ, టిటిడి పరిపాలనా భవనం వద్ద గత 14 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నారు. గురువారం  సాయంత్రం ఈవో జవహర్ రెడ్డి చర్చల పేరుతో కార్మికులను పిలిపించుకుని బెదిరింపులకు దిగార‌ని కార్మికులు ఆరోపించారు. 
 
 
కాంట్రాక్టు వ్యవస్థలో లోపాలు, సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తించార‌ని విమ‌ర్శిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని కొనసాగించాలని కార్మికులు నిర్ణయించుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని టిటిడి అధికారులు, పోలీసులను ఉసిగొల్పి అర్ధ రాత్రి సిఐటియు నాయకులు కందారపు మురళి, నాగరాజు, జయచంద్ర, సాయి లక్ష్మి లను గృహ నిర్బంధం చేశారు. శుక్రవారం టిటిడి పరిపాలనా భవనం వద్ద ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల నిరసన దీక్ష శిబిరానికి వందలాది మంది పోలీసులు వెళ్లి కార్మికులను చెల్లాచెదురు చేసి, నాయకుల్ని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేశారు. 
 
 
ధార్మిక సంస్థ టీటీడీలో అధర్మాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న సిఐటియు నేతలు టి. సుబ్రమణ్యం, ఆర్. లక్ష్మీ, చిన్నా, మల్లికార్జున్ రావులతోపాటు మద్దతుగా వచ్చిన జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ ని, కాంట్రాక్ట్ కార్మికులను అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోంది. సమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం, సమస్యలు చెప్పుకున్న పేదలపై నిర్బంధాన్ని ప్రయోగించడం, వారి గొంతుపై కత్తి పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్ర‌శ్నించారు. 
 
 
తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని కోరుతున్నారు. తిరుమల కొండపై జరపతలపెట్టిన టిటిడి బోర్డు సమావేశంలోనైనా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు చర్చించి పరిష్కారానికి తోడ్పడాలని కోరారు. టిటిడి లాంటి ధార్మిక సంస్థలో కాంట్రాక్టు వ్యవస్థను, కమిషన్ల దందాలను లేకుండా చేయాలని సిఐటియు విజ్ఞప్తి చేసింది.