1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Amazon Tops Trust Rankings as Dark Patterns Continue Across E-Commerce Platforms: Datum Index

అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచిన అమెజాన్: డేటమ్ ఇండెక్స్

Amazon
భారత దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ కామర్స్ రంగం.. డార్క్ ప్యాటర్న్స్(Dark Patterns) అని పిలిచే మోసపూరిత ఆన్‌లైన్ డిజైన్ల వల్ల మన దేశం భారీగా ఆర్థిక నష్టాన్ని చవి చూస్తోంది. డేటమ్ ఇంటెలిజెన్స్(Datum Intelligence) ప్రచురించిన 'డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేసెస్' (Dark Patterns in India-s Online Marketplaces) నివేదిక ప్రకారం.. ఈ డార్క్ ప్యాటర్న్స్ కారణంగా భారతీయ వినియోగదారులు ఏటా సుమారు రూ.25 వేల కోట్ల నుండి రూ.28 వేల కోట్ల వరకు నష్టపోతున్నారు. దేశంలోని 304 మిలియన్ల ఆన్‌లైన్ కొనుగోలుదారులలో దాదాపు 88 శాతం మంది నెలకు సగటున రూ. 78 నుండి రూ. 87 వరకు నష్టపోతున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది.
 
2026 మొదటి త్రైమాసికంలో (Q1 2026) దేశంలోని 50 నగరాల్లో 2,590 మందికి పైగా వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఇందులో క్విక్ కామర్స్, ఇ-కామర్స్ మరియు ఆన్‌లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన 12 ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా పరిశీలించారు. ఈ డార్క్ ప్యాటర్న్స్ ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి, వినియోగదారులపై పడుతున్న ఆర్థిక ప్రభావం ఎంత, మరియు కంపెనీలపై కస్టమర్ల నమ్మకం ఎలా దెబ్బతింటోంది అనే అంశాలను ఈ సర్వే అంచనా వేసింది. ఈ తనిఖీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కంపెనీకి, అత్యంత అధ్వాన్నంగా ఉన్న కంపెనీకి మధ్య ఏకంగా 92 పాయింట్ల భారీ వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది.
 
ముఖ్యమైన పరిశోధన ఫలితాలు కింద ఉన్నాయి:
భారత దేశంలో అత్యంత విశ్వసనీయమైన ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌గా అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది. సర్వేలో పాల్గొన్న వినియోగదారులలో 50 శాతం మంది అమెజాన్‌ను అత్యంత నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌గా పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఫ్లిప్‌కార్ట్, మింత్రా మరియు నైకా వంటి సంస్థలు వినియోగదారులలో నెగటివ్ టాక్ (Net distrust) మూటగట్టుకున్నాయి. వీటిలో ఫ్లిప్‌కార్ట్ నమ్మకానికి సంబంధించిన వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నప్పటికీ (41 శాతం మంది అస్సలు నమ్మకం లేదని, 37 శాతం మంది నమ్మకం ఉందని చెప్పారు).. ప్రతి కొనుగోలుపై కస్టమర్ల నుండి అదనపు డబ్బును తీసుకోవడం వల్లే ఈ వ్యతిరేకత వస్తోందని నివేదిక పేర్కొంది.
 
ఆన్‌లైన్ ట్రావెల్ విభాగంలో మేక్‌మైట్రిప్ అత్యంత సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌గా గుర్తింపు పొందగా, క్లియర్‌ట్రిప్ వినియోగదారులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న మోసపూరిత ప్లాట్‌ఫారమ్‌ల జాబితాలో ముందు వరుసలో నిలిచింది.
 
క్విక్ కామర్స్ విభాగంలో బిగ్‌బాస్కెట్ ప్లాట్‌ఫారమ్.. వినియోగదారులను డార్క్ ప్యాటర్న్స్‌కు గురి చేయడంలో అత్యంత అధ్వాన్నమైన స్కోరును నమోదు చేసింది.
 
ప్రత్యక్ష ఆర్థిక నష్టాలతో పాటు, ఈ మోసపూరిత పద్ధతులు వినియోగదారుల ప్రవర్తనలో కూడా పెద్ద మార్పులకు కారణమవుతున్నాయి. దీనివల్ల కస్టమర్లు తమ ఖర్చులను తగ్గించుకోవడం, ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ధరలను ఎక్కువగా పోల్చి చూడటం లేదా పూర్తిగా ఇతర యాప్‌లకు మారిపోతుండటంతో.. ఏకంగా రూ.55 వేల కోట్ల విలువైన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ(GMV) ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. భారత దేశంలోని 304 మిలియన్ల ఆన్‌లైన్ కొనుగోలుదారులలో 88 శాతం మంది.. హిడెన్ ఛార్జీలు(దాచిన రుసుములు), ఫోర్స్డ్ యాడ్-ఆన్స్ (బలవంతపు కొనుగోళ్లు), సబ్‌స్క్రిప్షన్ ట్రాప్స్(సబ్‌స్క్రిప్షన్ ఉచ్చులు), డ్రిప్ ప్రైసింగ్, తప్పుడు అర్జన్సీ ట్యాక్టిక్స్(కృత్రిమ కొరతను చూపడం) వంటి పద్ధతుల వల్ల నెలకు రూ.78 నుండి రూ.87 వరకు నష్టపోతున్నారు. ఈ పద్ధతులు కేవలం నేరుగా డబ్బులు గుంజడమే కాకుండా, వినియోగదారులలో నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి.
 
మరోవైపు, ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే వినియోగదారులలో ఏకంగా 63 శాతం మంది.. డిజిటల్ లావాదేవీల సమయంలో ఇలాంటి హిడెన్ ఛార్జీలు లేదా డ్రిప్ ప్రైసింగ్‌ను ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. 2024 లో నమోదైన 52 శాతంతో పోలిస్తే ఇది చాలా పెద్ద పెరుగుదల. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనలు, నివారణ చర్యలు.. ఈ మోసపూరిత డిజిటల్ పద్ధతులను అడ్డుకోవడంలో ఇప్పటివరకు పరిమిత విజయాన్ని మాత్రమే సాధించాయని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ డార్క్ ప్యాటర్న్స్ ప్రభావం ఇ-కామర్స్, బ్యాంకింగ్, ట్రావెల్, రైడ్-హెయిలింగ్, ఇన్సూరెన్స్ (బీమా), ఆన్‌లైన్ పేమెంట్స్ మరియు డిజిటల్ లెండింగ్ (ఆన్‌లైన్ అప్పులు) ప్లాట్‌ఫారమ్‌లలోని మిలియన్ల మంది వినియోగదారులపై నిరంతరం కొనసాగుతూనే ఉంది.
 
భారతదేశ డిజిటల్ వ్యవస్థలో ఈ డార్క్ ప్యాటర్న్స్ అనేవి ఒక వ్యవస్థీకృత సమస్యగా ఎలా మారిపోయాయో ఈ నివేదిక ప్రధానంగా ఎత్తిచూపింది. ప్రస్తుత సర్వే ఫలితాల ప్రకారం.. దేశంలోని 73 శాతం ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను బలవంత పెట్టే విధానాలను ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు తమకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. అలాగే 69 శాతం ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికీ డ్రిప్ ప్రైసింగ్ పద్ధతులనే వాడుతున్నాయి. ఇవి కొనుగోలు ప్రక్రియ ముగిసే చివరి నిమిషంలో మాత్రమే అదనపు రుసుములను స్క్రీన్‌పై చూపిస్తాయి. వీటితో పాటు సర్వే చేసిన ప్లాట్‌ఫారమ్‌లలో సగానికి పైగా సంస్థలు 'బైట్ అండ్ స్విచ్' (Bait-and-switch) తప్పుడు పద్ధతులను వాడుతున్నట్లు తేలింది. ఈ విధానంలో మొదట ప్రకటనల్లో చూపించే ఆఫర్లకు.. చివరగా వినియోగదారుడికి లభించే అసలు ఉత్పత్తి, ధర లేదా సేవలకు మధ్య చాలా తేడాలు ఉంటున్నాయి.
About Writer
ఐవీఆర్