1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. APIIC Chairman Roja visited corona virus positive person's home

కరోనా పాజిటివ్ వచ్చిన ఇంటికి వెళ్ళిన రోజా, ఆ తర్వాత ఏం చేశారంటే?

APIIC Chairman
అసలే కరోనా వైరస్. ఏ వైపు నుంచి.. ఎవరి దగ్గరి నుంచి ఈ వైరస్ సోకుతుందోనన్న భయం జనంలో ఉంది. అందుకే ప్రతి ఒక్కరు మాస్క్ లు వేసుకుని రోడ్లపై తిరుగుతున్నారు. ఇక కరోనా వచ్చిన వారి ఇళ్ళ దగ్గరకు వెళ్ళాలంటే ఎంత భయం ఉంటుంది. అటువైపుగా వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయినా, పిచికారీ చేసే మున్సిపల్ సిబ్బంది అయినా ఎవరైనా సరే చాలా సేఫ్టీగా వెళ్ళాలనుకుంటారు. 
 
అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన నియోజకవర్గంలో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండటం.. అందులోను ఢిల్లీ నుంచి వచ్చిన వారే కావడంతో నగరి ప్రజలు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రోజా మాత్రం ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. 
 
అయితే నిన్న వడమాలపేట మండలం వడమాలకు చెందిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో పారిశుధ్య కార్మికులతో పిచికారీ చేయాలని మున్సిపల్ అధికారులను రోజా ఆదేశించారు. అంతేకాదు ఆమే స్వయంగా రంగంలోకి దిగి రసాయనాలతో పాజిటివ్ రోగి ఇంటికి వెళ్ళి పిచికారీ చేశారు. ఆ యువకుడు నివాసమున్న చుట్టుప్రక్కల ప్రాంతంలో కూడా రోజానే స్వయంగా రసాయనాలతో పిచికారీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
 
ఆ తరువాత స్థానిక ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారెవరైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోమని కోరారు రోజా. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా రోజా స్వయంగా రసాయనాలతో పిచికారి చేయడంపై ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.
About Writer
జె
తర్వాతి కథనం
కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?