శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (19:11 IST)

ఎమ్మెల్యే రోజాపై ప్రశంసలు... నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్!! (video)

నగరి ఎమ్మెల్యేగా వైకాపాకు చెందిన ఆర్కే.రోజా కొనసాగుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈమె తన సొంత నియోజకవర్గంలోనే ఉంటూనే బాధితులను ఆదుకుంటున్నారు. అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులను అప్రమత్తం చేస్తూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, నియోజకవర్గంలోని ఆస్పత్రులకు అవసరమైన కరోనా కిట్లను ఆమె సొంత డబ్బులతో సమకూర్చుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాపై నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. 'కరోనా' వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తప్పుబట్టారు. పైగా, ఆస్పత్రులకు కావాల్సిన ప్రొటెక్షన్ మాస్కులు, కిట్లను కూడా ప్రభుత్వం సరఫరా చేయలేదని విమర్శించారు. 
 
అదేసమయంలో నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఓ మహిళ అయినప్పటికీ.. ధైర్యంగా రోడ్లపై తిరుగుతా ఐదు మండలాలకు అవసరమైన సహాయ సామాగ్రిని అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి మహిళ ఎమ్మెల్యేగా ఉండాలన్నారు. పైగా, కరోనా వైరస్‌కు తాము నాయకులమంటూ గొప్పలు చెప్పుకున్న నేతల్లో ఒక్కరు కూడా ఇపుడు కనిపించడం లేదన్నారు. 
 
నగరి మున్సిపాలిటీలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైవున్నాయని తెలిపారు. ఈ వైరస్ మరింత మందికి సోకకుండా చర్యలు తీసుకుంటున్నామనీ, అందుకు కావాల్సిన సహాయాన్ని ఎమ్మెల్యే రోజా చేస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఓ సెల్ఫీ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయి, ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
 
ప్రొటెక్షన్ మాస్క్‌ల కొనుగోలుకు కూడా తమ వద్ద నిధులు లేవనీ, అన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేశారంటూ ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‍‌గా తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నగరి కమిషనర్ వ్యవహరించారని భావించిన ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసినట్టు సంబంధిత వర్గాల సమాచారం. నగరి ఇన్‌చార్జి కమిషనర్‌గా సిహెచ్.వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.