గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (09:24 IST)

మాస్క్ లేకుండా రోడ్లపైకి వస్తే ఆర్నెల్లు జైలు.. ఎక్కడ?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మీట్. ఇక్కడ జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వేలాది మంది ముస్లింలకు ఈ వైరస్ సోకింది. వీరంతా రాష్ట్రంలోని తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడంతో ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ఢిల్లీలో కరోనా వైరస్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 
 
దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అనేక కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా హాట్‌స్పాట్ కేంద్రాలను గుర్తించిన ఢిల్లీ సర్కారు.. ఆ ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసింది. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో నివసించేవారిలో ఒక్కరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. వీరికి కావాల్సిన అన్ని రకాలైన కిరాణా సరకులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోంది. 
 
ఈ క్రమలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తే ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఎటువంటి రక్షణ కవచాలు ధరించకుండా రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
 
అలాగే, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.200 నుంచి రూ.1000 వరకు జరిమానా కూడా విధించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వాధికారులు కూడా మాస్కులు ధరించకుండా మీటింగులు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.