1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:44 IST)

ప్లీజ్, అర్థం చేసుకోండి, రోడ్లపైకి రావద్దండి: రోజా విజ్ఞప్తి

చిత్తూరుజిల్లా నగరిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదట్లో ఒక్క కేసు కూడా లేని నగరి నియోజకవర్గంలో సరిగ్గా రెండురోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లింల వరకు రెండు కేసులు నమోదు కాగా, అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరికి పాజిటివ్ ఈరోజు నమోదైంది. దీంతో నగరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
 
అయితే వెంటనే స్థానిక ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఢిల్లీ జమాత్ మసీదులకు వెళ్ళొచ్చిన నగరిలోని కీళ్లపట్టు, రామ్ నగర్‌లో ప్రాంతాల్లో పర్యటించిన రోజా అక్కడ పూర్తిగా పురపాలక సంస్థ సిబ్బందితో కలిసి శానిటేషన్ చేశారు. ప్రజలందరికీ మరోసారి మాస్క్ లను పంపిణీ చేశారు.
 
జనం ఎవరూ ఇంటి నుంచి బయటకురావద్దని, రామ్, నగర్, కీళ్లపట్టు ప్రాంతాలను రెడ్ జోన్ ప్రకటించామని రోజా చెప్పారు. ప్రజలకు అవసరమైన ఆహారాన్ని ఇప్పటికే రోజా తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నారు. దీంతో జనం రోడ్లపైకి రావద్దని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు రోజా.
 
పాజిటివ్ కేసులు నమోదైన నగరిలోని రోగుల కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా తిరుపతిలోని రుయా క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారి రక్తనమూనాలను కూడా సేకరిస్తున్నారు. తన నియోజకవర్గంలో రోజా ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమవుతూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.