1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. What is the situation regarding COVID cases in Andhra?

ఆంధ్రలో కోవిడ్ కేసులు, పరిస్థితి ఎలా వుంది?

Covid 19 Test
2019 నుంచి 2022 వరకూ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమించి కట్టడి చేసాయి. ఐతే ఈ కరోనా వేరియంట్లు మాత్రం ఒక పట్టాన వదలడంలేదు. తాజాగా 2022 తర్వాత ఇప్పుడు జూలై నెలలో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీనితో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ రెండు జిల్లాల పరిధిలో కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో మరో 8 యాక్టివ్ కేసులు వెలుగుచూసాయి. ఐతే ఈ 8 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందనీ, ఎట్లాంటి తీవ్రమైన లక్షణాలు లేవని వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం వీరంతా హోమ్ ఐసోలేషన్లో కోలుకుంటున్నారు.
 
పుణెకి వేరియంట్ శాంపిళ్లు
వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈ కేసులు వెలుగుచూడటంతో ఎక్కడైతే వైరస్ ప్రబలిందో ఆ ప్రాంతాలలో ఆరోగ్యశాఖ శానిటైజేషన్, కాంటాక్ట్ ట్రేసింగ్ తీవ్రతరం చేసింది. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వాసుపత్రులలో ఐసోలేషన్ వార్డులను కూడా సిద్ధం చేసినట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఇన్ఫెక్షన్‌కి కారణమైన వేరియంట్‌ను గుర్తించేందుకు శాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. ఒమిక్రాన్ వేరియంట్‌కి దీనికి దగ్గర పోలికలు వున్నట్లు చెబుతున్నారు.
 
వైద్య నిపుణులు ఏం చెపుతున్నారు?
కరోనా వైరస్ కు సంబంధించి ఇట్లాంటి వేరియంట్లు అప్పుడప్పుడు విజృంభించడం సహజమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు ఎప్పటిలాగే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వైద్య అధికారులు అధికారికంగా వేరియంట్ వివరాలను నిర్ధారించే వరకు ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పాటించాల్సిన జాగ్రత్తలు
రద్దీగా వుండే ప్రాంతాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు చేతులను నోటివద్ద, ముక్కు వద్ద పెట్టుకోరాదు.
తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి.
జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
 
About Writer
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి