ప్రేమ పేరుతో నమ్మించాడు.. భర్త నుంచి విడగొట్టాడు.. తన గదికి తీసుకొచ్చి నోట్లో పుగుల మందు తాపించాడు..
ఓ వివాహతను అ వ్యక్తి ప్రేమ పేరుతో వేధించి, తన దారికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించి భార్యను దూరం చేశాడు. పిమ్మటి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాడు. తన గదికి తీసుకొచ్చి ఆ తర్వాత మరో యువకుడితో మాట్లాడుతుందని గుర్తించి గొడవ పడి పురుగుల మందు బలవంతంగా గొంతులో పోశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి జారుకోవడంతో ఆసుపత్రిలో చేర్పించి అక్కడ నుంచి పారిపోయాడు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతికి గతేడాది ఏప్రిల్లో వివాహమైంది. పరిచయస్థుడైన భవానీశంకర్ ప్రేమించానంటూ ఆమె వెంట పడ్డాడు. ఆమె భర్తకు ఫోన్ చేసి తప్పుడు ఆరోపణలు చేయడంతో వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి.
ఈ క్రమంలో యువతి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. విజయవాడలో నర్సింగ్ కోర్సులో చేరేందుకు శిక్షణ తీసుకుంటూ ఉండడంతో భవానీశంకర్ ఆమె వెంట పడి పెళ్లి చేసుకుంటానని వేధించడం ప్రారంభించాడు. యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను హైదరాబాద్ నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు.
అయితే, యువతి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా ఆమె వివరాలు తెలుసుకుని తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని తరచూ ఒత్తిడి చేయడంతో అతని మాటలు నమ్మి ఈ నెల 2న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చింది. భవానీశంకర్ ఆమెను దేవీనగరులోని తన గదికి తీసుకొచ్చాడు.
ఈ నెల 3న సాయంత్రం యువతి చరవాణిని చెక్ చేయగా దానిలో మహేష్ అనే యువకుడి ఫోన్ నంబరు ఉండడంతో ఆమెను అనుమానించాడు. గొడవపడి కొట్టాడు. ఆమె హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లగా మళ్లీ ఆమెను తన గదికి తీసుకొచ్చాడు. మళ్లీ గొడవ పెట్టుకుని ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు.
అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించి తల్లికి సమాచారం చేరవేసి అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
