1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. School principal found stabbed to death in her Nalgonda home

ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ దారుణ హత్య...

rupareddy
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసే వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. 
 
పోలీసుల కథనం మేరకు మండల కేంద్రంలోని జేబీ కాలనీకి చెందిన రూపారెడ్డి (48) ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. ఆమె తన భర్త రాజేందర్ రెడ్డితో కలిసి జేబీ కాలనీలో ఉంటున్నారు. వారికి హైదరాబాద్‌లో కూడా సొంతిల్లు ఉండటం, వారి కుమారుడు అభినవ్‌ రెడ్డి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ విద్య చదువుతుండటంతో తరచూ వారు హైదరాబాద్‌ వెళ్తుంటారు. 
 
గత శనివారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. భర్తకు హైదరాబాద్‌లో పని ఉండటంతో ఆమె ఒక్కరే మంగళవారం ఉదయం కొండమల్లేపల్లి వచ్చి పాఠశాలకు హాజరయ్యారు. నిత్యం సాయంత్రం ఆరున్నర వరకు పాఠశాలలోనే ఉండేవారు. కానీ మంగళవారం తమ ఇంటికి స్నేహితులు వస్తున్నారని చెప్పి సాయంత్రం 5.25 గంటల సమయంలో పాఠశాలకు సమీపంలోనే ఉన్న వారి ఇంటికి వెళ్లారు. 
 
బుధవారం ఉదయం భర్త ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ రావడంతో తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్‌ చేసి ఇంట్లోకి వెళ్లి చూడమని చెప్పారు. సదరు వ్యక్తులు వచ్చి ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో విషయాన్ని తిరిగి అతనికి ఫోన్‌ ద్వారా తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన భర్త రాజేందర్‌రెడ్డి తమ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న చింతపల్లి ఎస్ఐ రాంమూర్తికి ఫోన్‌ చేసి తమ ఇంటికి వెళ్లి చూడాల్సిందిగా కోరాడు. 
 
సదరు ఎస్ఐ ఇంటి పక్కల వారితో కలిసి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి భర్తకు సమాచారమిచ్చారు. ఆమె శరీరంపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు సమాచారం. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పోలీసు జాగిగాలతో పరిశీలించారు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నవీన్‌కుమార్‌, ఎస్ఐ రమేశ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూపారెడ్డి కుమారుడు అభినవ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆగష్టు 13, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?