1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Man Chases Woman, Throws Her On Road Before Dragging Her Towards Hotel In Meerut

యువతిపై దాడి చేసి బలవంతంగా హోటల్‌లోకి లాక్కెళ్లాడు.. వీడియో వైరల్

Man Chases Woman
Man Chases Woman
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నవంబర్ 24, మంగళవారం నాడు ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. అబు లేన్ ప్రాంతంలో ఒక వ్యక్తి రద్దీగా ఉన్న రహదారిపై యువతిపై దాడి చేసి, ఆమెను బలవంతంగా హోటల్‌లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు జరిగిన ఈ ఘటనను గమనించిన స్థానికులు, దుకాణదారులు వెంటనే స్పందించి ఆ యువతిని కాపాడారు.
 
సీసీటీవీ ఫుటేజీలో, ఒక యువతి హోటల్ భవనం నుండి బయటకు పరిగెత్తుకుంటూ రావడం, సల్మాన్ అనే నిందితుడు ఆమెను వెంబడించడం కనిపిస్తుంది. నిందితుడు ఆమెను పట్టుకుని, నేలకేసి కొట్టి, ఆపై ఎత్తుకుని తిరిగి హోటల్ వైపు తీసుకెళ్లాడు.
 
ఈ ఘటనను గమనించిన స్థానికులు, బాటసారులు, దుకాణదారులు అక్కడికి చేరుకున్నారు. ఒక మహిళా బాటసారి ధైర్యంగా నిందితుడిని అనుసరిస్తూ హోటల్ లోపలికి వెళ్లారు. కొద్దిసేపటికే ఆమె ఆ యువతిని తిరిగి బయటకు తీసుకువచ్చారు. అక్కడ ఉన్నవారు ఆమెకు తాగడానికి నీరు ఇచ్చారు.
 
ఈ ఘటనపై మీరట్ పోలీసులు సల్మాన్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 115(2), 127(2), 351(3) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతానికి ఎఫ్‌ఐఆర్‌లో హోటల్ మేనేజర్ లేదా నిర్వాహకుల పేర్లు లేవు. 
 
అయితే, విచారణలో వారి పాత్ర ఏమైనా ఉందేమో పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. గదిని కేటాయించే ముందు హోటల్ యాజమాన్యం సల్మాన్, ఆ యువతికి సంబంధించిన గుర్తింపు పత్రాలను సేకరించారా లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
 
పోలీసులు వచ్చేలోపు, హోటల్ సిబ్బంది సహాయంతో నిందితుడు అక్కడి నుండి తప్పించుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై మీరట్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. సదరు వ్యక్తికి, యువతికి ముందే పరిచయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. 
 
ఆ యువకుడు, యువతికి అంతకుముందే పరిచయం ఉంది. ఫిర్యాదుదారు ఇచ్చిన రాతపూర్వక వాంగ్మూలం ఆధారంగా, సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.. పూజారి అరెస్ట్