చేవెళ్ళలో రేవ్ పార్టీ - 108 మంది విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లలో వారాంతపు సెలవుల్లో విచ్చలవిడిగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్నో రకాలైన హెచ్చరికలు చేసినా, రేవ్ పార్టీల కట్టడికి పలు రకాలైన చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో తాజాగా నగర శివారు ప్రాంతమైన చేవెళ్లలో ఓ రేవ్ పార్టీ జరిగింది.
దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పార్టీని భగ్నం చేశారు. పైగా, ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 108 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులందరికీ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో నలుగురికి పాజిటివ్ ఫలితం వచ్చింది. ఈ నలుగురు విద్యార్థులు కన్నాబిస్ అనే మత్తు పదార్థాన్ని సేవించినట్టు తేలింది.
అలాగే, రేవ్ పార్టీ కోసం సిద్ధం చేసిన గంజాతో పాటు ఏడు కార్లు, 70 మొబైల్ ఫోన్లను పోలీసులు, భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ రేవ్ పార్టీలో పట్టుబడిన విద్యార్థులంతా హైదరాబాద్ నగరంలోని వివిధ కాలేజీల్లో ఉన్నత చదువులు చదువుతుండటం గమనార్హం. అలాగే, అరెస్టు చేసిన 108 మంది విద్యార్థుల్లో పలువురు మైనర్లు కూడా ఉన్నట్టు సమాచారం.

