తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి.. సర్వాంగ సుందరంగా శ్రీవారి ఆలయం!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కోయల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
ఆలయ శుద్ధిలో భాగంగా శ్రీవారి గర్భగుడి, కులశేఖరపడి, బంగారు వాకిలి ప్రాంగణాలను శుభ్రం చేసి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన చూర్ణాన్ని ఆలయగోడలకు పూశారు. ఆలయ ద్వారాలకు అలంకరించడానికి తయారు చేసిన పరదాలను ఈవో సాంబశివరావు ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామి సన్నిధిలో అప్పగించారు. ఆలయాన్ని ప్రత్యేక విద్యుద్దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అంతేకాకుండా, వైకుంఠ ఏకాదశికి శ్రీవారిని దర్శించుకునేందుకు కొండపైకి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో సాంబశివరావు దగ్గరుండి ఏర్పాట్లను పూర్తిచేయించారు. ముఖ్యంగా.. ప్రత్యేక ప్రవేశదర్శనం, దివ్యదర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.
శ్రీవారి సేవకులందరూ హిందూ ధర్మానికి కార్యకర్తల్లా పనిచేయాలని ఆయన సూచించారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం చేయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశినాడు అర్థరాత్రి నుంచి వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతాయని, ఏకాదశి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు బుధవారం మధ్యాహ్నం నుంచి క్యూలైన్లోకి అనుమతి ఇస్తామని ఆయన వివరించారు.

