1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. China's 19-passenger electric Aircraft completes first piloted flight

నింగిలోకి విజయవంతంగా ఎగిరిన ఎలక్ట్రిక్ వాణిజ్య విమానం

comac electric flight
విమానయాన రంగంలో చైనా మరో కీలక మైలురాయిని అధికమించింది. ప్రభుత్వ రంగ సంస్థ కోమాక్ అభివృద్ధి చేసిన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కమర్షియల్ విమానం సీఈ-25ఏ  తొలిసారిగా విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. షాన్డంగ్ ప్రావిన్స్‌లోని బిన్ జౌ నగరంలో శనివారరం ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు. 
 
ఈ ప్రయోగాత్మక పరీక్షలో ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్-టెస్ట్ ఇంజనీర్ పాలుపంచుకున్నారు. మొత్తం 57 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియలో, విమానం 16 నిమిషాలకు పైగా నింగిలో విహరిస్తూ 60.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. 
 
విమాన పనితీరు సంతృప్తికరంగా ఉందని, అన్ని వ్యవస్థలు నిర్దేశిత లక్ష్యాల మేరకు పనిచేశాయని కోమాక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఈ విమానం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తొలి మానవరహిత ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
 
ప్రధానంగా సమీప నగరాల మధ్య ప్రయాణాల కోసం ఈ విమానాన్ని రూపొందించారు. ఇది 19 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. గరిష్టంగా 10 టన్నుల బరువుతో టేకాఫ్ అయ్యే సామర్థ్యం దీనికి ఉంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానం, గరిష్టంగా 400 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. రెక్కలు అమర్చిన 10 ఎలక్ట్రిక్ డక్టెడ్ ఫ్యాన్ల సాయంతో ఇది పనిచేస్తుంది.
 
ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ సీఏటీఎల్, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ వంటి భాగస్వామ్య సంస్థలతో కలిసి కోమాక్ ఈ విమానాన్ని అభివృద్ధి చేసింది. ఇది పైలట్ల పర్యవేక్షణతో పాటు అటానమస్ (స్వయంచాలిత) మోడ్‌లోనూ పనిచేయగలదు. ఈ విమానానికి 'టైప్ సర్టిఫికెట్' మంజూరు చేయాలని కోరుతూ కోమాక్ చేసిన దరఖాస్తును చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ఆమోదించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భారత్ దాడుల భయం.. సురక్షిత ప్రాంతాలకు హఫీజ్ - మసూద్ అజార్ తరలింపు