గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు... దిక్కుతోచని స్థితిలో భారతీయ యాత్రికులు
గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా - ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా తమపై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ అమెరికా మిత్రదేశాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ కారణంగా యూఏఈలో వందలాది మంది భారత్ యాత్రికులు చిక్కుకున్నారు. ఈ యుద్ధ ప్రకంపనలు కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అనేక విమాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో టూరిస్టులు సైతం విమానాశ్రయాల్లో చిక్కుకునిపోయారు.
రాజస్థాన్‌లోని దీగ్ జిల్లాకు చెందిన కొందరు జ్యోతిష్యులు ఓ సదస్సు కోసం ఫిబ్రవరి 28న దుబాయ్ వెళ్లారు. ఆదివారం తిరిగి రావాల్సి ఉండగా, విమానాలు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయారు. వీరితో పాటు జోధ్‌పూర్, కోట, సికార్ వంటి నగరాలకు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు, ఇతర నివాసితులు కూడా ఉన్నారు. కెనడా నుంచి భారత్‌కు వస్తున్న తాన్య అనే విద్యార్థిని అబుదాబిలో చిక్కుకుపోయింది. జోధ్‌పూర్‍కు చెందిన సంత్ అమృత్‍రామ్ మహరాజ్ ప్రవచనాల కోసం దుబాయ్ వచ్చిన 120 మంది యాత్రికుల బృందం కూడా తిరుగు ప్రయాణంలో అబుదాబి విమానాశ్రయంలో చిక్కుకుపోయింది.
విమానాలు రద్దు కావడంతో తమను విమానాశ్రయాల సమీపంలోని హోటళ్లకు తరలించినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. అయితే, దుబాయ్, అబుదాబి విమానాశ్రయాల సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించాయని కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కోటకు చెందిన సిద్ధార్థ్ జైన్ అనే విద్యార్థి హాస్టల్ దగ్గర ఒక క్షిపణి పడిందని, పేలుళ్ల శబ్దాలు వస్తున్నాయని చెబుతూ తన కుటుంబానికి ఫొటోలు, వీడియోలు పంపడం కలకలం రేపింది.
ఈ విషయంపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. గల్ఫ్ లో చిక్కుకున్న యాత్రికులతో తాను ఫోనులో మాట్లాడానని, అక్కడి ప్రవాస మార్వాడీ సంఘం వారికి సహాయం అందిస్తోందని తెలిపారు. చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.