నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
Indiramma sarees
మహిళల అభిరుచులకు అనుగుణంగా, ఆకర్షణీయమైన చిలుక పచ్చ (పారెట్ గ్రీన్) రంగులో ఈ చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. వీటి నాణ్యత, మన్నికకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
విభిన్న అభిరుచులకు తగినట్లుగా ఆధునిక, సాంప్రదాయ డిజైన్లతో రెండు రకాల చీరలను సిద్ధం చేశారు. ఇందులో 6.30 మీటర్ల పొడవున్న 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవున్న 5 లక్షల పాలి-కాటన్ చీరలు ఉన్నాయి.
ఈ చీరలను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన చేనేత కార్మికులు నేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు చీరలను అందించడమే కాకుండా, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళలందరూ ఈ చీరలను పొందేందుకు అర్హులు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ జరుగుతుంది.
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా, ప్రజా ప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది ఈ చీరలను పంపిణీ చేస్తారు. అర్హులైన మహిళలు తమ ఫుడ్ సెక్యూరిటీ కార్డు (రేషన్ కార్డు), ఆధార్ వివరాలను సమర్పించి చీరలను తీసుకోవచ్చు.
పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు, లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

