నా ఫోన్‌ను ప్రధాని స్వయంగా ట్యాపింగ్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన నేతృత్వంలోని కేంద్ర ఎన్డీయే ప్రభుత్వంపై భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. తన ఫోన్‌ను భారత ప్రధానమంత్రి స్వయంగా ట్యాపింగ్ చేస్తున్నారని, అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ బహిరంగంగా పేర్కొన్నారు.
ప్రధానితో ముఖాముఖి చర్చలో పాల్గొన్నప్పుడు ఈ ఆధారాలను బయటపెడతానని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీకి విదేశీ శక్తుల నుంచి నిధులు అందుతున్నాయని, ఆయనకు వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఎన్డీయే నాయకులు చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆధారం ఇక్కడే ఉంది, ఈ ఫోన్‌లోనే ఉంది. ప్రధానమంత్రికి ఇది తెలుసు, ఎందుకంటే ఆయనే తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు. ఆయన నాతో ముఖాముఖి చర్చకు వచ్చినప్పుడు, విదేశీ శక్తుల చేతుల్లో ఎవరున్నారు, ఎవరు దేశ వ్యతిరేకి అనేది అందరికీ తెలిసిపోతుంది.. అని రాహుల్ అన్నారు.
ప్రతిపక్ష నాయకుడు ప్రధానిపై చేసిన ఈ ఆరోపణ చాలా తీవ్రమైనది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా చాలా పెద్ద నేరం. రాహుల్ గాంధీ గతంలో కూడా పలుమార్లు ఇదే ఆరోపణ చేశారు. దీనిపై మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కొత్తేమీ కాదు.
అధికారంలో ఉన్నవారిపై ప్రతిపక్ష నాయకులు తరచుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలంగాణలో కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ విషయంలో ఇలాంటి ఆరోపణలే వచ్చిన విషయాన్ని మనం గమనించవచ్చు.

