ఆంధ్రప్రదేశ్‌లో కియా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకెళుతోందని పారిశ్రామిక దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ప్రభుత్వ విధానాలు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని కొనియాడారు.
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో తమ భవిష్యత్ ప్రణాళికలను, భారీ పెట్టుబడుల వివరాలను ప్రకటించారు. కియా, జీఎంఆర్, సాగర్ డిఫెన్స్ వంటి సంస్థల అధినేతలు ఏపీ ప్రభుత్వ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.
కియా ఇండియా సీఈఓ, ఎండీ గ్వాంగ్ లీ మాట్లాడుతూ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విజయానికి ఏపీలోని కియా పరిశ్రమే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. "ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఏపీ ప్రభుత్వంపై ఉన్న పూర్తి భరోసాతోనే మేం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాం. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌ను విస్తరించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించాం. ఇందుకోసం రూ.18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం. ఈ విస్తరణ ద్వారా ప్రత్యక్షంగా 12 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి" అని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం ఏటా 4 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తూ, ఏపీ ఆటోమొబైల్ ఎకో సిస్టమ్‌కు కియా అండగా నిలుస్తోందని తెలిపారు. ఇక్కడ తయారైన కార్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ, 'మేక్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నామని గర్వంగా చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సుస్థిర ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలోనూ భాగస్వాములమవుతామని ఆయన స్పష్టం చేశారు.
జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. ఏపీలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాదని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నడుస్తోందని ప్రశంసించారు. "ఒక పెట్టుబడిదారుడిగా చెబుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. భోగాపురం విమానాశ్రయం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా (ఎకనామిక్ ఇంజన్) మారుతుంది. గతంలో మేం శంషాబాద్ విమానాశ్రయం గురించి ఆలోచించి నిర్మించడం వల్లే, ఇప్పుడు అది తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అదే తరహాలో భోగాపురం ఏపీకి కీలకం కానుంది" అని ఆయన వివరించారు.

