పేదరికాన్ని జయించిన భారత్ : ప్రధాని నరేంద్ర మోడీ
పేదరికాన్ని భారత్ అత్యంత వేగంతో జయించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అదేసమయంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫిక్కీ శతవార్షిక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేట్ సంస్థలకు ఓ విజ్ఞప్తి చేశారు. దేశం మరింత ముందుకు వెళ్లడానికి అవసరమైన సంస్కరణలను నిస్సందేహంగా వెల్లడించాలని సూచించారు.
'గత ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో విఫలమైంది. భారత్ ఒకప్పుడు బలహీనమైన ఐదు దేశాల సరసన ఉండేది. 12 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. భారత పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తోంది. పాత విధానాలు భారత్ వృద్ధిని అణచివేశాయి. కాలం చెల్లిన విధానాలు దేశాభివృద్ధిని కుంటుపరిచాయి. గత విధానపరమైన వైఫల్యాలు దేశ వృద్ధిని ఆలస్యం చేశాయి' అన్నారు.
ఆ తర్వాత కార్పొరేట్ సంస్థలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 'గత 13 ఏళ్లలో భారత్‌లో 50 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఇది బీజేపీ హాయాంలోనే సాధ్యమైంది. వ్యాపారులను ప్రోత్సాహించేందుకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించాం. అదేవిధంగా వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించామని గుర్తుచేశారు.
అలాగే, ఇది స్నేహపూర్వక ప్రభుత్వం. మీరంతా (పరిశ్రమ వర్గాలను ఉద్దేశిస్తూ) మా స్నేహితులే. దేశం మరింత వేగంగా పురోగతి సాధించేందుకు అవసరమైన సూచనలను ఓపెన్ మైండ్‌తో చెప్పండి. రాబోయే 20 ఏళ్లలో తీసుకునే ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడులకు 'ఇండియా ఫస్ట్' పునాది కావాలి. ఇది స్వయం సమృద్ధి సాధించడంతో పాటు మీ వ్యాపారానికి మరిన్ని అవకాశాలను అందిస్తుంది' అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అదేవిధంగా వ్యవసాయం, సంబంధిత రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

