అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ : స్పీకర్ గడ్డం ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ నుంచి ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సభా కార్యక్రమాలు ముగిసేంతవరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సిఫార్సు చేశారు.
దీంతో కేటీఆర్, హరీశ్ రావు, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, జగదీశ్‌రెడ్డి, అనిల్ జాదవ్, సుధీర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునీత లక్ష్మారెడ్డి తదితరులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, మూడో రోజైన బుధవారం సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే వియ్ వాంట్ జస్టిస్ అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. సస్పెన్షన్ అనంతంర స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు.
మరోవైపు, మంగళవారం స్పీకర్‌ను అవమానపరచడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్శింహా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
