Minor girl: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై భవనం పైనుంచి కిందకు తోసేశాడు..
ఒక మైనర్ బాలికపై ఓ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఖమ్మం నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 12 ఏళ్ల మైనర్ బాలికను నమ్మించి, ఓ కిరాతకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన అకృత్యాన్ని దాచేందుకు, సదరు నిందితుడు ఆ బాలికను అపార్ట్‌మెంట్ భవనం పైనుంచి కిందకు తోసేశాడు.
జూన్ 6న జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురైన ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మొదట ప్రమాదంగా భావించిన మైనర్ బాలిక తల్లిదండ్రులు.. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలికపై అఘాయిత్యం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో షాకయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఒక వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించి, పోక్సో కింద కేసు నమోదు చేశారు. అయితే ఇంకా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
