భూపాలపల్లి హాస్టల్‌లో అమానుషం - విద్యార్థిని చితకబాదిన వార్డెన్
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో అమానుష సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని వార్డెన్ కర్ర తీసుకుని చితకబాదింది. మిగిలిన విద్యార్థులు రహస్యంగా వీడియో తీసి బహిర్గతం చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో చదువుకుంటన్న ఓ విద్యార్థిని ఇటీవల పరీక్ష రాశాక చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. విద్యార్థిని కనిపించడం లేదని వార్డెన్‌తో పాటు సాటి విద్యార్థులు ఆందోళన చెందుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ తర్వాత బాలిక తిరిగి హాస్టల్‌కు వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న వార్డెన్ ఆ విద్యార్థినిని తన గదికి పిలిపించుకుని.. పరీక్ష రాశాక ఎక్కడికి వెళ్లావంటూ కర్రతో కొట్టింది. నువ్వు కనిపించకుండా పోయిన తర్వాత నేను ఎంత ఆందోళన చెందానో తెలుసా.. నా ఉద్యోగం రిస్క్‌లో పడేలా చేస్తావా అంటూ వార్డెన్ భవానీ ఆ విద్యార్థిని చితకబాదింది.
ఈ ఘటనను ఓ విద్యార్థిని రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో విద్యార్థినిని విచక్షణా రహితంగా కొట్టిన సదరు వార్డెన్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
