దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ... ఏం జరిగింది?
తెలంగాణలోని సైబరాబాద్ ఐటీ హబ్ పరిధిలో ఉన్న మాదాపూర్‌లోని దుర్గం చెరువులో దూకి, ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. హైటెక్ సిటీలోని కేబుల్ బ్రిడ్జి పైనుంచి రాజేష్ (25) అనే వ్యక్తి చెరువులోకి దూకాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రాజేష్, హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నాచారంలోని ఒక హాస్టల్‌లో ఉంటున్న రాజేష్, సోమవారం నాడు తన స్నేహితుడిని కలిసేందుకు మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీకి వచ్చాడు. ఆ తర్వాత అతను కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లి, చెరువులోకి దూకినట్లు తెలుస్తోంది.
రాజేష్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కారణాలు ఇంకా తెలియరాలేదు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, బృందాలు చెరువులో రాజేష్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. గత మూడు రోజుల్లో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న రెండవ ఘటన ఇది కావడం గమనార్హం.

