తెలంగాణాలో పంచాయతీ పోరు : ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్
తెలంగాణా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరివున్నారు. మెజార్టీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు.
ఈ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో బీఆర్‌ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఆ రెండు పార్టీల మద్దతుదారులైన సర్పంచి అభ్యర్థులు చంద్రకళ, సౌమ్య వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని జడ్చర్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోనూ స్వల్ప ఘర్షణ జరిగింది. ఇతర గ్రామాల వారు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నంటూ బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
