చిరంజీవి రాజకీయాల్లో సీనియర్.. సినిమాల్లో జూనియర్ : కమల్ హాసన్
మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఉలగ నాయకన్ కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని తన స్నేహితుడిగాను, అక్కినేని నాగార్జునను సోదరుడుగా అభివర్ణించారు. అయితే, చిరంజీవి రాజకీయాల్లో మాత్రం సీనియర్ అని, సినిమాల్లో జూనియర్ అని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ నగరంలో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేదికపై కమల్ హాసన్ ప్రతిష్టాత్మక "పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు"ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నటుడు నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ప్రకటించిన బీఎన్ రెడ్డి అవార్డును ఆయన తరపున స్వీకరించారు.
అవార్డు స్వీకరించిన అనంతరం కమల్ హాసన్ మాట్లాడుతూ, ప్రేక్షకుల మధ్య కూర్చున్న చిరంజీవిని ఉద్దేశించి, "చిరంజీవి, నేను సోదరులం. ఆయన రాజకీయాల్లో నాకు సీనియర్, సినిమాలలో నాకు జూనియర్. మేమిద్దరం 70వ దశకంలోనే కథానాయకులుగా మారాం" అని అన్నారు. తెలుగు నటీనటులంతా తన కుటుంబ సభ్యులేనని, గతంలో చెన్నైలో ఉన్న పరిశ్రమ ఇప్పుడు హైదరాబాద్‌కు ఇల్లు మారిందని, తన దృష్టిలో మాత్రం ఇదంతా ఒకే పరిశ్రమ అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు. "ఇకపై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ వంటి హద్దులు వద్దు. మనదంతా ఒకే సినిమా, అదే ఇండియన్ సినిమా. ఈ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసే గొప్ప కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. దీనికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. భవిష్యత్ తరాలను ముందుకు నడిపే ఈ పల్లకీకి మా భుజాలను అందిస్తాం" అని కమల్ హాసన్ అన్నారు.
