1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Bruce Lee The Fighter review

చిరంజీవి పాస్... ఇదే 150వ చిత్రమా...? రామ్ చరణ్ బ్రూస్ 'సిల్లీ'

Bruce Lee The Fighter review
బ్రూస్ లీ నటీనటులు : రామ్‌ చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కృతి కర్బంద, నదియా, రావు రమేష్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, తనికెళ్ళ భరణి, అరుణ్‌ విజయ్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు
 
సాంకేతిక సిబ్బంది... సంగీతం : ఎస్‌ఎస్‌ తమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, నిర్మాత : డివివి దానయ్య, మూలకథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీను వైట్ల.
 
సాఫీగా సాగిపోయే జీవితం గురించి కోరుకోకు. జీవితంలో ఎన్ని అడ్డంకులెదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యంతో పోరాడే జీవితమే అసలైన జీవితమనే కాన్సెప్ట్‌తో.. బ్రూస్‌ లీ చిత్రం ప్రారంభమవుతుంది. దర్శకుడు శ్రీను వైట్ల పలికే డైలాగ్‌ అది. అయితే 'బ్రూస్‌ లీ' పేరుకి తగినట్లు ఆయనలా ఫైట్స్‌ చేసే సీన్స్‌ కానీ, మేనరిజం కానీ ఎక్కడా కన్పించదు. యాక్షన్‌ సీన్స్‌లో బ్రూస్‌లీ బ్రాండ్‌ లేదు. కేవలం పేరు మాత్రమే. ఎవరినైనా ఇన్‌స్పైర్‌ అయితే వారిని అనుకరించడం కొద్దిగానైనా వుంటుంది. ఇందులో ఎందుకనో దర్శకుడు వదిలేశాడు. ఇక.. సినిమాలో రామ్‌ చరణ్‌ను చూడ్డాని కంటే... చిరంజీవిని చూడ్డానికే ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా వున్నారనేది థియేటర్లలో జనాలను చూస్తే అర్థమవుతుంది. మరి చిరంజీవి ఈ చిత్రానికి వుపయోగపడ్డాడా! లేదా చూద్దాం. 
 
కథ :
చిన్నతనంలోనే అక్కంటే కార్తీక్‌కు ప్రాణం. తన కన్నా ఆమెదే పైచేయి వుండాలనుకుంటాడు. తండ్రి రావు రమేష్‌ తనను కలెక్టర్‌ చేయించాలంటే.. తానూ అవుతానని అక్క పట్టుపట్టడంతో తెవిలిగా.. అక్కకు పెద్ద స్కూల్లో సీటు కోసం తనే క్లాస్‌లో తక్కువ మార్కులు సంపాదించి ఆమెకు సీటు వచ్చేలా చేస్తాడు. అక్కాతమ్ముడిగా కృతికర్బంధా, రామ్‌చరణ్‌ నటించారు. అయితే.. ఇంటర్‌ తప్పిన కార్తీక్‌ అక్క కోసమే.. సినిమాల్లో ఫైటర్‌గా, డూప్‌గా చేస్తూ సంపాదిస్తుంటాడు. పెద్దయ్యాక కూడా తన సంపాదనతో లాప్‌టాప్‌నూ, తెలివితేటల్తో అక్కకు ఫ్రీ సీటు వచ్చేలా చేస్తాడు. ఇదిలావుండగా,  తన స్నేహితుడి చెల్లెల్ని ఓ రౌడీ బలవంతంగా పెండ్లి చేసుకుంటుంటే పోలీస్‌ డ్రెస్‌తో వెళ్ళి బుద్ధిచెబుతాడు కార్తీక్‌. 
 
ఇది చూసిన రియా(రకుల్‌ ప్రీత్‌సింగ్‌) తనకిష్టమైన పోలీసోడిని చూసి ప్రేమలో పడిపోతుంది. తాను అసలు పోలీసు కాదని చెప్పడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వదు. ఈలోగా కొన్ని సంఘటనలు ఆటోమేటిగ్‌గా జరిగిపోతుంటాయి. చట్టవ్యతిరేకంగా లిక్కర్‌ వ్యాపారం, దొంగనోట్ల ముఠాలను రెండ్‌హ్యాండెండ్‌గా పట్టుకునేందుకు తన స్నేహితురాలికి రియా సాయపడుతుంది. అలా వారి చెరలో చిక్కుకుంటుంది. ఇది తెలిసి కార్తీక్‌.. ఆమెను కాపాడి వారి దందాలు సీజ్‌ చేస్తాడు. 
ఇదంతా చేస్తుంది... ఓ అండర్‌కవర్‌ పోలీసు ఆఫీసర్ అనే నిర్ణయానికి గ్యాంగ్‌ లీడర్‌ దీపక్‌ రాజ్‌(అరుణ్‌ విజయ్‌) వచ్చేస్తాడు. ఇక.. రియా నాన్న ముఖేష్‌రుషి.. ఢిల్లీలో ఇంటిలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌. కార్తీక్‌ చేసిన పనులు తెలిసి అతనికో కొత్త ఆపరేషన్‌ చేయమని ఆజ్ఞాపిస్తాడు. అలా దీపక్‌ రాజ్‌ను అడ్డుకట్టవేసి నిజంగా పోలీసు వుద్యోగం సంపాదించాడు. అయితే మధ్యలో చిరంజీవి ఎక్కడ నుంచి వస్తాడు? అనేది క్లైమాక్స్‌ వరకూ ఆగాల్సిందే. 
 
పెర్‌ఫార్మెన్స్‌...
 
మనంలో అఖిల్‌ క్రెడిట్‌ కొట్టుకుపోయినట్లు ఇందులో రామ్‌చరణ్‌ కంటే చిరంజీవి ఎంట్రీతో అంతా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడనే చెప్పాలి. రఫ్‌ అండ్‌ టఫ్‌ మాస్‌ లుక్‌‌లో కనిపించి అందరినీ థ్రిల్‌ చేశాడు. ఆయన స్క్రీన్‌ ప్రెజన్స్‌, పెర్ఫార్మన్స్‌, స్టంట్స్‌, డైలాగ్స్‌ థియేటర్స్‌‌లో ఉన్న ఆడియన్స్‌‌కి ఒక్కసారిగా గ్యాంగ్‌ లీడర్‌, ఖైదీ, కొదమసింహం రోజులను గుర్తుచేస్తాయి. ఇక రామ్‌ చరణ్‌ చాలా రోజుల తర్వాత మళ్ళీ లుక్‌‌ని మార్చుకొని చేసి ఈ సినిమాలో చాలా స్టైలిష్‌‌గా కనిపించాడు. శ్రీను వైట్ల క్రియేట్‌ చేసిన కార్తీక్‌ పాత్రలో ఓ కొత్త రామ్‌ చరణ్‌ని చూస్తాం. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాలకే పరిమితం. చరణ్‌ అక్కగా కృతికర్బంధ సరిపోయింది. విలన్‌గా పరిచయం అయిన విజయ్‌కుమార్‌ కొడుకు అరుణ్‌ విజయ్‌ బాగానే చేసాడు. నదియా మరోసారి రిచ్‌ బిజినెస్‌ ఉమెన్‌గా మెప్పించింది. రావు రమేష్‌, పవిత్రా లోకేష్‌, సంపత్‌ రాజ్‌‌లు మంచి నటనని కనబరిచారు. డైరెక్టర్‌‌గా జయప్రకాశ్‌ రెడ్డి, హీరోగా బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి కాసేపు నవ్వించారు.
 
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస తను ఇచ్చిన అవుట్‌‌పుట్‌ సింప్లీ సూపర్బ్‌. నటీనటుల్ని సరికొత్తగా చూపించాడు. అలాగే ప్రతి షాట్‌, ప్రతి సీన్‌ చూడటాని ఓ కలర్ఫుల్‌ పెయింటింగ్‌లా ఉంటుంది. విజువల్స్‌ పరంగా తన మ్యూజిక్‌తో ఒక భావాన్ని క్రియేట్‌ చేసిన క్రెడిట్‌ మాత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కే చెందుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్‌లో ఆర్‌ఆర్‌ బాగా ఇచ్చాడు. మిగిలినచోట్ల సోసోగా వుంది. ఎడిటర్‌ ఎం.అర్‌ వర్మ ఫర్వాలేదు. ఫైట్‌మాస్టర్స్‌ అనల్‌ అరసు, రామ్‌ లక్ష్మణ్‌, విజయ్‌, కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మాస్‌ని ఆకట్టుకుంటాయి. కోన వెంకట్‌ రాసిన కొన్ని డైలాగ్స్‌ బాగానే పేలాయి.  కథ, కథనం, దర్శకత్వం అనే విభాగాల విషయానికి వస్తే.. శ్రీను వైట్ల బ్రూస్‌ లీ కోసం అనుకున్న సెంటిమెంట్‌ స్టొరీ లైన్‌ కొత్తదేమీ కాదు, కానీ ఆ కథకి పాత్రలని కొత్తగా రాసుకోవడంలో కొంతమేర సక్సెస్‌ అయ్యాడు.  
 
విశ్లేషణ:
మొదట్లో ఏదో నీతి చెప్పినట్లు... కొటేషన్‌ చెప్పినంతగా చిత్ర కథ లేదు. సాదాసీదా కథ. దానికి తనదైన మెరుగులు దిద్దాడు శ్రీను వైట్ల. ఆ క్రమంలో కామెడీతో ఎంటర్‌టైన్‌ చేయలేకపోయాడు. రొటీన్‌ తెలుగు సినిమాలా... హీరోహీరోయిన్లు కలుసుకుంటే చాలు.. ఓ పాటే వచ్చేస్తుంది. 'లే చలో...' అనే పాటలో.. లేకే చలో.. అంటున్నాడన్నంతగా పాడేవారిలో స్పష్టత వుంది. స్పీడ్‌గా సాగే పాటల్లో సాహిత్యం అర్థంచేసుకోవడానికి టైం పడుతుంది. సంభాషణపరంగా కోన వెంకట్‌, గోపి మోహన్‌లు చేసింది పెద్దగాలేదు. ఏమాత్రం కొత్తదనం అనిపించకపోగా.. ప్రాస కోసం పడే పాట్లు కన్పిస్తాయి. మొదటి భాగమంతా... యాక్షన్‌, అక్క కోసం త్యాగం చేసే తమ్ముడిగా రామ్‌ చరణ్‌ కన్పిస్తాడు. 
 
సెకండాఫ్‌లో.. విలన్‌కు, హీరోకు వైరం వుండాలి కాబట్టి తను విలన్‌డెన్‌లో ఎంటరవుతాడు. ఇంతకుముందు చిత్రాల్లో హీరో విలన్ని బకరా చేసినట్లే ఈ చిత్రంలోనూ హీరో బకరా చేసేస్తాడు. పైగా పోలీసు డిపార్ట్‌మెంట్‌గా నమ్మించే సీన్స్‌ తెరపై చూడ్డానికి బాగున్నా కొన్ని బలవంతంగా పెట్టినట్లుగా అన్పిస్తాయి. అందులో ముఖ్యంగా తన అక్క సీటు కోసం ఛీ కొడుతున్నా... సమీర్‌ ఇంటిముందు రాత్రి పగలు పడిగాపు కాసి డ్రైవింగ్‌ రాని సమీర్‌ కొడుకును యాక్సిండెంట్‌ నుండి కాపాడటం బలవంతంగా అతికించినట్లుంది. ఇలా పలు సన్నివేశాలున్నాయి. అందులో క్లైమాక్స్‌లో గుర్రపు స్వారీ కూడా.
 
ఇక బ్రహ్మానందం ఎపిసోడ్‌ రొటీన్‌.. బకరా ఫార్మెట్. కానీ. కొత్తగా చేయాలని చూసినా ఎట్రాక్ట్‌ లేదు. కోతి ఎలా బిహేవ్‌ చేస్తుందో చక్కగా చూపాడు బ్రహ్మానందం. చెప్పుకుంటూ పోతే సినిమా ముగింపు వస్తుంది.. అయితే.. చిరంజీవి ఎక్కడా? అనే ఆతృత అందరికీ కలుగుతుంది. తన తండ్రి చావుబతుల్లో వుంటే కాపాడుకోవడానికి హీరో ఆసుపత్రికి వెళతాడు. మరోవైపు తన ప్రేయసిని విలన్‌ గ్యాంగ్‌ చంపడానికి నిర్ణయిస్తుంది. ఆమెను కాపాడమని గురువుగారంటూ చిరంజీవికి ఫోన్‌ చేసి.. కార్తీక్‌.. రక్షించమంటాడు. అప్పుడు.. తాను 150వ సినిమా షూటింగ్‌లో వున్నానంటూ డైలాగ్‌ చెప్పిన చిరంజీవి తన 150వ సినిమా ఇదేనని చెప్పకనే చెప్పేశాడు. 
 
ఇక ముగింపులో కూడా నువ్వు.. మంచి హార్స్‌ రైడర్‌వంటగదా చూపించు.. అంటూ చిరంజీవి అడగడం... ఇద్దరూ గుర్రాలపై వెళ్ళడం.. మీ స్పీడ్‌ను మేం అందుకోలేమని రామ్‌ చరణ్‌ చెప్పడం.. దానికి బదులుగా.. ఇదంతా ఫ్యాన్స్‌ ఇచ్చిన ఎనర్జీ అంటూ... వారికోసం వెళుతున్నానంటూ మాయం కావడం.. ఇదంతా.. చిరంజీవి తన స్టేటస్‌ కోసం రాసుకుని.. తన కోసమే ఫ్యాన్స్‌ వస్తారు. నీ కోసం కాదనేలా చెప్పినట్లయింది. అందుకు తగినట్లే.. ఈ సినిమా కూడా వుంది. సో.. కేవలం చిరంజీవి కోసమే చేసిన సినిమా. ఆడియో వేడుకలో చెప్పినట్లే... స్క్రీన్‌పై నన్ను నేను చూసుకున్నాక.. హమ్మయ్యా! పాస్‌ అయిపోయాను చాలు అన్నట్లు చిరంజీవి పాస్‌.. రామ్‌ చరణ్‌ ఫెయిల్‌.