పెళ్లాడుతానన్న కుర్రాడితో వ్యభిచార గృహం నుంచి 'జ్యోతిలక్ష్మీ' లేచిపోతే... రివ్యూ రిపోర్ట్
జ్యోతిలక్ష్మీ నటీనటులు: ఛార్మి, సత్య, వంశీ, సాండీ, అజయ్ ఘోష్, చైతన్య, ప్రియదర్శిని రామ్ తదితరులు, కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: ఛార్మి, నిర్మాతలు: చార్మి, సి.కళ్యాణ్ ; స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్
మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ‘మిసెస్ పరాంకుశం’ ఆధారంగా ఈ ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రాన్ని తెరకెక్కించానని పూరి జగన్నాథ్ ఇప్పటికే చెప్పేశారు కాబట్టి కథ ఏమిటో చాలామటుకు క్లియర్. ఇకపోతే ఈ చిత్రంలో జ్యోతిలక్ష్మీగా టైటిల్ పాత్రలో నటించిన ఛార్మి నటనకే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా తొలిసారి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో చార్మి వేశ్య పాత్రలో నటించింది. జ్యోతిలక్ష్మీ పాత్రలో ఛార్మి ఎలా నటించింది... పూరీ జగన్నాథ్ టేకింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ :
సత్య (సత్య దేవ) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వేశ్యనే ప్రేమించి పెండ్లి చేసుకోవాలనే పాలసీ పెట్టుకుంటాడు. ఎక్కడో బజారులో చూసిన చార్మిని మొదటిచూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె కోసం అన్ని వ్యభిచార కేంద్రాలను వెతికి ఆఖరికి ఆమెను కనిపెడతాడు. ఆమెకోసం ఎంతో ఖర్చుపెడతాడు. చివరికి ఆమెను బయటకు తెచ్చి పెండ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. సత్యను దుండగులు ఆసుపత్రిపాలు చేస్తారు. ఒంటరిగా వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఏం చేసింది? అనేది మిగిలిన కథ.
పెర్‌ఫార్మెన్స్:
సినిమా మొత్తం ఒన్‌మేన్ షో. చార్మినే కథంతా నడిపిస్తుంది. ఆమె హావభావాలు చాలా అలవోకగా పలికేసింది. వేశ్యగా కొన్ని సీన్స్‌లో జీవించింది. కొన్నిచోట్ల అతిగా కూడా అనిపిస్తుంది. ఇక హీరో సత్య పాత్ర ఫర్వాలేదు. నిలకడైన ఎక్స్‌ప్రెషన్‌తో తన క్యారెక్టర్‌ను చాలా బాగా క్యారీ చేశాడు. మిగతా వారంతా తమ పరిధి మేరకు బాగానే నటించారు. అమ్మాయిల రాకెట్ బాస్‌గా అజయ్ ఘోష్ జీవించేశాడు. అమ్మాయిలంటే పడిచచ్చే బిగ్‌షాట్‌గా బ్రహ్మానందం, అంతే ఇదిగా వుండే పాత్రల్లో సంపూర్ణేష్ బాబు, కాదంబరి కిరిణ్ తదితరులు పోషించారు. సాక్షి పత్రికలో కీలక బాధ్యుడు రామ్ కరెప్టెడ్ పోలీసు అధికారిగా నటించాడు.
సాంకేతిక విభాగం :
సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి బాగానే ఉన్నా సినిమాలో అసందర్భంగా వచ్చాయి. టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకునేవిధంగా ఉంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫస్టాఫ్‌లో ఫన్ మూడ్‌ను, సెకండాఫ్‌లో సీరియస్ మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ పీజీ విందా సరిగ్గా క్యారీ చేశారు. దర్శకుడిగా పూరీ రెండు బాధ్యతలు నిర్వర్తించాడు. సమాజంలో జరుగుతున్న సంఘటనలే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. డైలాగులు కొన్ని అనవసరంగా కనిపించినా పూరీ స్టైల్లో బలంగా ఉన్నాయి. దర్శకుడిగా పూరీ తన పంథా ఏమీ మార్చకుండానే ఓ మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశారు.
విశ్లేషణ
ఆడవాళ్ళంటే అమితమైన గౌరవముండే ఓ వ్యక్తి వేశ్యను పెళ్ళి చేసుకోవాలనుకోవడం, అతడి నేపథ్యం, జ్యోతిలక్ష్మీ నేపథ్యం, సత్య ప్రేమను జ్యోతిలక్ష్మీ అర్థం చేసుకోవడం, చివరికి ఓ సమస్యపై పోరాడటం.. ఇలా ఓ బలమైన కథకు కావాల్సిన సబ్ ప్లాట్స్ ఈ కథలో చాలా ఉన్నాయి. అయితే వీటి బ్యాక్‌డ్రాప్‌లో గతంలో కొన్ని చిత్రాలు వచ్చినా.. వేశ్య కథకు ఎలాంటి ముగింపు ఇచ్చిందనేది పూరీ చేసిన ప్రయత్నం. ఆమధ్య పలువురు సినిమా తారలు హోటల్‌లో పట్టుబడటం, ఆమె పేరు మీడియా కోడై కూయడం జరిగింది. కానీ ఆమెతో వున్న ప్రముఖుడు ఎవరనేది చెప్పలేదు. కేవలం ఆడవారినే టార్గెట్ ఎందుకు చేయాలి? అంటూ జ్యోతిలక్ష్మి వేసిన ప్రశ్నలు.. కామన్‌మాన్‌కు వస్తాయి. దాన్నే సినిమాగా తీస్తే అది జ్యోతిలక్ష్మి అవుతుంది.
కాగా, సినిమాకు ప్రాణమైన జ్యోతిలక్ష్మీ క్యారెక్టరైజేషన్ ఆలోచనలు, భావోద్వేగాలనే మేజర్ పాయింట్‌గా కథను నడిపే అవకాశమున్నా, అనవసరంగా డైలాగులను జొప్పించి చెప్పాలనుకోవడం మరో మైనస్. ఓవరాల్‌గా జ్యోతిలక్ష్మీ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉన్నా, ఆమె పరిస్థితులను అర్థం చేసుకుంటూ మారిపోవడం చిన్నచిన్న సన్నివేశాలతో తేల్చేయడం బాగాలేదు. పాయింట్ చిన్నదే కాబట్టి.. దాన్ని చూపించాలంటే పాటలు పెట్టాలి అనే సూత్రంతో ఎక్కువ పాటలు పెట్టి కథను నడిపించాడు. చివర్లో వచ్చే ఐటెమ్ సాంగ్ లాంటిది ఒక్కసారిగా జ్యోతిలక్ష్మీ పోరాటాన్ని దారి తప్పించింది. క్లైమాక్స్ మరీ సినిమాటిగ్గా ఉంది. పోరాటమంటే దానికో పరిష్కారం ఉండి తీరాలన్న ఆలోచనలో క్లైమాక్స్‌ను తేల్చేసినట్టు స్పష్టమవుతుంది. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కథలోనిదే అయినా అతికించినట్టు కనిపిస్తుంది.
బలమైన మెసేజ్‌నే సాగదీసి చెప్పడం ఒక్కోసారి బెడిసికొడుతుంది. అనిపించడం, అతి సాధారణంగా, సినిమాటిగ్గా ముగిసే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. వేశ్యగా ముద్రపడిన ప్రతి ఆడది ఎవరో ఒకరు మోసం చేయడంతో ఈ రొంపిలోకి దిగుతుంది. ఈ పాయింట్‌ను సమాజం గుర్తుంచుకోవాలనే నీతిని చెప్పదలిచాడు దర్శకుడు. అయితో జ్యోతిలక్ష్మి ఇచ్చిన ముగింపు చాలా స్పీడ్‌గా సినిమాటిక్‌గా సాగిపోతుంది. మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని చెప్పవచ్చు. ఏవరేజ్ సినిమా.

