1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Oopiri Movie Review

తెలుగు కథలకు 'ఊపిరి'.. హార్ట్ టచింగ్ స్టోరీ.. 'మిలియనీర్ - పేదోడి' ఎమోషనల్‌ జర్నీ!

తెలుగు కథలకు 'ఊపిరి'

Oopiri Movie Review
నటీనటులు:
నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణి తదితరులు.
 
సాంకేతిక విభాగం:
సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి. పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
 
ఈ మధ్య తెలుగు సినిమా కథల్లో చాలా మార్పు కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ఈ విషయంలో అక్కినేని నాగార్జున ముందువరుసలో ఉంటున్నారు. సరికొత్త కథలతో తాను సినిమా చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు కూడా. 'సోగ్గాడే చిన్నినాయనా'తో మన సంప్రాదాయాలు, ఆచారలు ఒక్కసారి సంక్రాంతికి టచ్‌ చేశాడు. అంతకుముందు 'మనం'తో మూడు జన్మల ప్రేమకథను హార్ట్‌ టచ్‌తో తెరకెక్కించాడు. ఈసారి.. ఫ్రెంచ్‌ సినిమా 'ఇన్‌టచబుల్‌'ను రీమేక్‌గా తీసుకున్నారు. ఆ చిత్రాన్ని తన భార్య అమలతో నాలుగేళ్ళనాడే చూశాననీ, అప్పుడే ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర చేయాలనుకున్నానని వెల్లడించారు. సరిగ్గా ఆయన ఆలోచనలకు పసిగట్టినట్లే.. 'బృందావనం' దర్శకుడు వంశీ పైడిపల్లి దాన్ని తీసుకురావడం.. సర్‌ప్రైజ్‌ అయి.. ఆయన కథను ఓకేచేసి.. తెరకెక్కించాడు. దీనికి పీవీపీ సంస్థ ముందుకు రావడంతో పెద్ద ప్రాజెక్ట్‌ అయింది. పరిమిత నటీనటులతో తీసిన ఆ సినిమాలో అసలు ఏముందో చూద్దాం.
 
కథ:
శ్రీను (కార్తీ) ఓ ఆవారా.. దొంగతనాలు చేసి జైలుకు వెళతాడు. లాయర్‌ అలీ.. పెరోల్‌పై శ్రీనును బయటకు తెస్తాడు. సత్‌ప్రవర్తతో బయట వుంటే.. కేసు కొట్టేస్తారని సలహా ఇస్తాడు. అందుకే.. సత్‌ప్రవర్తన ఉండే ఉద్యోగం కోసం లాయర్ అలీనే సంప్రదిస్తాడు శ్రీను. చదువులేని, తెలుగు తప్ప మరో భాష రానీ కార్తీకి.. చిన్నపిల్లల కేర్‌టేకర్‌గానూ, వృద్ధాశ్రమంలోనూ పని అప్పగిస్తే.. అవేవీ తనకు నచ్చవనీ.. ఎవరైనా ఒక్కరికే కేర్‌టేకర్‌గా ఉండే ఉద్యోగం చూపించమంటాడు. పేపర్లో పడిన ఓ ప్రకటనచూసి.. మిలియనీర్‌ ఆదిత్య (నాగార్జున)కు కేర్‌టేకర్‌గా ఇంటర్వ్యూకు హాజరవుతాడు. 
 
చాలామంది ఇంటర్వ్యూలో.. ఆదిత్య పీఏ తమన్నా అడిగిన ప్రశ్నలకు.. అందరూ సేవ కోసమనీ, మరో దాని కోసమనీ.. రకరకాలుగా తమకు తోచిన రీతిలో సమాధానం చెపుతారు. ఆఖరికి.. శ్రీను హాజరై చాలా కేర్‌లెస్‌గా.. ఈ ఇల్లు చూసి.. తర్వాత నిన్నుచూసి పడిపోయానని చెబుతాడు.. ఇతన్నే పరిశీలించిన ఆదిత్య.. కార్తీని సెలక్ట్‌ చేస్తాడు. ఇక అక్కడ నుంచి అన్నీ తానే ఆదిత్యను చూసుకుంటుంటాడు. 
 
జైలు నుంచి వచ్చిన వాడు ఏదైనా చేస్తాడని.. ఆదిత్య స్నేహితుడు ప్రకాష్‌రాజ్‌ లాంటివారు చెప్పినా.. శ్రీనుపై నమ్మకంతో ఆదిత్య వారిని వారిస్తాడు. ఈ తర్వాత... శ్రీను ఇంటివ్యవహారాలు తెలుసుకుని.. అన్నగా.. కుటుంబాన్ని ఆదుకుంటాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి ఊపిరాడక.. మళ్లీ చావుబతుకుల మధ్య ఆసుపత్రికి ఆదిత్య చేరతాడు. అప్పుడు అతని గురించి పూర్తిగా తెలుసుకున్న శ్రీను.. ఆదిత్యను పారిస్‌ తీసుకెళతాడు. అక్కడే తన గతాన్ని గుర్తుచేసుకుని ఆనందాన్ని అనుభవిస్తాడు. అసలు ఆదిత్యకున్న గతం ఏమిటి? శ్రీనుకు తమన్నాకు సంబంధేమిటి? అన్నది మిగిలిన ఈ చిత్ర కథ.
 
 
పెర్‌ఫార్మెన్స్‌:
నటుడిగా.. నాగార్జున పూర్తి న్యాయం చేశాడు. మిలియనీర్‌ ఆదిత్యగా.. వీల్‌చైర్‌లో కూర్చొనే వుండే పాత్రలో ఒదిగిపోయాడు. సంతోషం, దు:ఖం.. ఆనందం, విషాదం.. ఉషారు.. వంటి ఫీలింగ్స్‌ను ఫేస్‌లో వ్యక్తిపరిచాడు. తమన్నా.. ఆయన పి.ఎ.గా నటించినా.. నటించడానికి పెద్దగా ఏమీలేకపోయినా.. కార్తీతో ఉండే సన్నివేశాలు నవ్వుతెప్పిస్తాయి. ప్రత్యేకించి.. కామెడీ ఆర్టిస్టులులేకుండా.. కేవలం కార్తీ, తమన్నా కాంబినేషన్‌.. ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఇక ప్రకాష్‌రాజ్‌ పాత్ర బాగానేవుంది. తనికెళ్ళభరణి, దివంగత కల్పన పాత్రలు వారి పాత్రమేరకే బాగా చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ ముగింపులో చనిపోయిన.. కల్పనకునివాళిగా.. పేరు వేయడం జరిగింది.
 
టెక్నికల్‌గా...
పి.ఎస్‌.వినోద్‌ సినిమాటోగ్రఫీ చిత్రానికి అమరింది. ప్రకృతి అందాలతోపాటు పారిస్‌లో కార్‌ ఛేజింగ్‌ సీన్స్‌లు చేసేటప్పుడు కెమెరా పని ఆకట్టుకుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ లేకపోయినా... కారు ఛేజింగ్‌ యాక్షన్‌ సీన్లు బాగున్నాయి. సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం జీవిత లోతులకు తీసుకెళ్ళింది. డ్యూయెట్లు లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్స్‌తోనే నడిపింది. గోపీసుందర్‌ మ్యూజిక్‌ ఓకే.
 
 
విశ్లేషణ:
డబ్బున్నా.. జీవితాన్ని సుఖంగా బతకలేమనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పారు. ఫ్రెంచ్‌ సినిమా 'ఇన్‌‌టచబుల్స్‌'లో ఇన్‌.. అంటే మనిషి లోపల.. టచ్‌ చేసే సన్నివేశాలు.. కథ, కథనం ఇందులో ఉన్నాయి. మరోవైపు పారీస్‌, బెల్జియం వంటి దేశాల్లో అందాలు కనులారా వీక్షించేందుకు ఈ చిత్రం దోహదపడింది. పి.ఎస్‌.వినోద్‌ విజువల్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. 'ఊపిరాడడంలేదు. కాస్త బయటకు తీసుకెళ్ళు..' వంటి సందర్భానుసారంగా డైలాగ్స్‌ కథకు అమరాయి. రయితలు కూడా ప్రాసకోసం ప్రాకులాడకుండా సన్నివేశపరంగా సంభాషణలు రాశారు. అప్పుడప్పుడు బాధపెడుతూ, మనసు మెలిక పెడుతూ కన్నీళ్ళు వచ్చేస్తాయనుకునే లోపు నవ్వించే సినిమా ఇది. మిలియనీర్‌, డబ్బులేనివాడి ఇద్దరి ఎమోషనల్‌ జర్నీ ఇది. ప్రతి పాత్ర మనసుకు నచ్చేలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది. కుటుంబసభ్యులతో హాయిగా కూర్చొని చూసే సినిమా అనడంలో సందేహమేలేదు.
 
నాగార్జున అభిమానులతోపాటు అందరినీ ఆలోచింపజేసే చిత్రమిది. వీల్‌చైర్‌ జీవితాన్ని అనుభవించే కొంతమంది జీవితాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. తెలుగు కథలకు కొత్తమార్గాన్ని చూపించిన ఇలాంటి కథలు ఈ చిత్రం తర్వాత మరిన్ని వస్తాయని ఆశించవచ్చు.
 
రేటింగ్‌: 3.5/5