గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (08:55 IST)

తన భార్య మరొకరితో సహజీవనం చేస్తుందనీ...

murder
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కసాయి భర్త కడతేర్చాడు. మరొకరితో సహజీవనం చేస్తుందని భావించిన ఈ దారుణానికి పాల్పడ్డాడు. అదీకూడా మృతురాలు బతుకమ్మ ఆడుతున్న సమయంలోనే దారుణంగా హత్య చేశాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. 
 
పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కూతురు మంగను స్థానికుడైన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు. నెల రోజులకే మంగ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని చనిపోవడంతో మరలా రెండో కుమార్తె స్వప్నను ఇచ్చి వివాహం చేశారు. 
 
వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగా జరిగింది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు.
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా.. ఆమె తలపై ఎల్లారెడ్డి ఇనుప రాడ్‌తో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.